ప్రకాశం జిల్లాకు నాగార్జున సాగర్ జలాల సరఫరా మెరుగుపడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సాంఘిక
సంక్షేమశాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి అధికారులను ఆదేశించారు. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో శనివారం సాగర్ జలాల మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. నాగార్జున సాగర్ నుండి విడుదలవుతున్న జలాలు జిల్లాకు తగిన స్థాయిలో రాకపోవడానికి గల కారణాలను మంత్రి అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. 57 టీఎంసీల సాగర్ జలాలు జిల్లాకు రావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 34 టీఎంసీల నీరు నీరు వచ్చిందని, మరో 23 టీఎంసీల నీరు అందితేసే టేల్యార్డ్ ప్రాంతాలైన సంతనూతలపాడు, ఒంగోలు, కొండపి నియోజకవర్గాలకు నీరు అందుతుందని తెలిపారు. అలాగే 85/3 మైలు పాయింట్ వద్ద నిరంతరం 2,700 క్యూసెక్కుల నీటిని నిల్వ చేసి విడుదల చేయాలని మంత్రికి సమస్యను తెలిపారు. దీనిపై నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో మంత్రి స్వామి ఫోన్ ద్వారా మాట్లాడారు. జిల్లాకు సకాలంలో నీటిని విడుదల చేసేందుకు సహకరించాలని కోరారు. అలాగే పల్నాడు ఎస్ఈ వెంకటరత్నం తోనూ మంత్రి ఫోన్లో మాట్లాడి నీటిని విడుదల చేసేలా మంత్రి సూచనలు చేశారు. ఈ సందర్భంగా నీటి పారుదలశాఖ అధికారులతో మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని ప్రతీ చివరి ఆయకట్టుకు నీరందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు సమ్మర్ స్టోరేజీలు, ఇతర చెరువులను నీటితో నింపాలన్నారు. వరి, ఇతర పంటల సాగుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లాలోని డిఈలు, ఈఈ, ఏఈఈలు పాల్గొన్నారు.

