రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. ఈ దిశగా ప్రతి సోమవారం కలెక్టరేట్లో జరిగే ‘ మీకోసం ‘ కార్యక్రమంలో ప్రత్యేకముగా ‘ రెవెన్యూ క్లినిక్ ‘ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం నుంచి వచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఈనెల 29వ తేదీ నుంచి ‘ మీకోసం ‘ కార్యక్రమంలో రెవెన్యూ అంశాలకు సంబంధించి వచ్చే అర్జీల పరిష్కారానికి ఐదు ప్రత్యేక టేబుళ్ళు ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా ఆర్.ఓ.ఆర్, పాస్ పుస్తకము, ఆర్.ఓ.ఎఫ్.ఆర్, ఏజెన్సీ భూములు, రీ సర్వే టేబుళ్లు ఏర్పాటు చేసి సంబంధిత రికార్డును కూడా అందుబాటులో ఉంచుతారు. రెవెన్యూ క్లినిక్ లో ప్రత్యేకంగా రిసెప్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. అందులోని సిబ్బంది అర్జీదారుతో మాట్లాడి సమస్య ఏమిటో తెలుసుకుని సంబంధిత టేబుల్ వద్దకు అర్జీదారును పంపుతారు. అన్ని పరిశీలించాక భూమి స్వభావము, సమస్య, దాని పరిష్కారానికి చేపట్టే కార్యాచరణ ( ఏ.టి.టి )తో కూడిన రిపోర్టును అర్జీదారుకు అందజేస్తారు. ఒకవేళ సమస్య సివిల్ అంశానికి సంబంధించినది అయితే న్యాయపరమైన సలహా కూడా అందిస్తారు. రెవెన్యూ క్లినిక్ కు వచ్చే తీవ్రమైన అంశాలు, న్యాయపరమైన వ్యవహారాలపై జాయింట్ కలెక్టర్, ఆర్డిఓ, తాసిల్దార్ స్థాయిలో చర్చలు జరిపి పరిష్కారం చూపుతారు. ప్రతిరోజూ
ఉదయం కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్ ఈ రెవెన్యూ క్లినిక్ పిటిషన్లపై సమీక్షిస్తారని ఆయన తెలిపారు. క్షేత్రస్థాయి అధికారులు సరైన చర్య తీసుకున్నారని నిర్ధారించుకున్నాకే ఈ పిటిషన్ ను ముగిస్తామని కలెక్టర్ తెలిపారు. రెవిన్యూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఈ విధంగా ప్రత్యేక దృష్టి సారించినందున ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
