హైదరాబాద్, డిసెంబర్ 29,(జే ఎస్ డి ఎం న్యూస్ ) :
పిల్లల్లో పుట్టుకతో వచ్చే కొన్నిరకాల సమస్యలతో పాటు పేగుల్లో క్యాన్సర్ లేదా ఇతర ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు తాత్కాలికంగా చేసే ఏర్పాటును కొలాస్టమీ అంటారు. ఇందులో భాగంగా మలవిసర్జన మార్గాన్ని తాత్కాలికంగా ఆపేసి. పెద్ద పేగుల చివరిభాగాన్ని పొట్ట భాగం వైపు నుంచి బయటకు తీస్తారు. అక్కడ ఒక డిస్పోజబుల్ బ్యాగ్ ఏర్పాటుచేయడం ద్వారా.. మలం అందులోకి వెళ్లేలా చూస్తారు. ఆ బ్యాగ్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం, మార్చుకోవడం ద్వారా వ్యక్తిగత పరిశుభ్రత పాటించవచ్చు. దీన్నే కొలాస్టమీ అంటారు. అయితే, ఈ తరహా ఏర్పాటు ఉన్న పిల్లలుండే కుటుంబాల్లో విపరీతమైన భయం, అనుమానాలు, సామాజిక సమస్యలు ఉంటాయి. వీటన్నింటినీ దూరం చేసేందుకు జాతీయ పీడియాట్రిక్ సర్జరీ డే సందర్భంగా సోమవారం సికింద్రాబాద్‌లోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రి పీడియాట్రిక్ సర్జరీ నిపుణుల ఆధ్వర్యంలో కొలాస్టమీ సపోర్ట్ గ్రూప్ ఏర్పాటుచేశారు. దీనికి చీఫ్ కన్సల్టెంట్ పీడియాట్రిక్ సర్జన్, పీడియాట్రిక్ యూరాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ ఎం. యోగనాగేందర్ నేతృత్వం వహించారు. ఈ గ్రూప్ ద్వారా కొలాస్టమీపై అవగాహన కల్పించి, వారికి తగిన విజ్ఞానం అందించడంతో పాటు కొలాస్టమీఏర్పాటుచేయించుకున్న పిల్లల తల్లిదండ్రులకు అవసరమైన అన్నిరకాల మద్దతుకల్పిస్తామనితెలిపారు. భారతదేశంలో ఇదే మొట్టమొదటి గ్రూప్ అని చెప్పారు. ఈ సందర్భంగా డాక్టర్ యోగనాగేందర్ మాట్లాడుతూకొలాస్టమీ అనేది మన శరీరం కోలుకోవడానికి చేసే తాత్కాలిక ఏర్పాటు మాత్రమే. పెద్దపేగులోని కొంత భాగాన్ని ఉదరం పైభాగంలోకి తీసుకొచ్చి, అక్కడ ఓపెనింగ్ పెడతాము. అక్కడ కొలాస్టమీ బ్యాగ్‌లోకి మలవిసర్జన జరుగుతుంది. పిల్లల్లో సాధారణంగా ఈ కొలాస్టమీ అనేది తాత్కాలికంగా చేసే మళ్లింపు అవుతుంది. ఏదైనా శస్త్రచికిత్స తర్వాత వారి పేగుల వ్యవస్థ కోలుకోవడానికి వీలుగా ఇలా చేస్తాం. ఇందుకు ప్రధానంగాకొన్ని కారణాలు ఉంటాయి. అవి.. మలద్వారం సరిగా ఏర్పాటుకాకపోవడం, హిర్ష్‌స్ప్రంగ్ వ్యాధి, పిల్లల్లో పేగుల సమస్య (నెక్రోటైజింగ్ ఎంటెరోకొలైటిస్), ప్రమాదంలో పేగులు దెబ్బతినడం, తీవ్రమైన ఇన్ఫెక్షన్లు లేదా పేగుల్లో ఆటంకాలు
డాక్టర్ బాబు ఎస్ మదార్కర్, కిమ్స్ కడల్స్ సికింద్రాబాద్ క్లినికల్ డైరెక్టర్, చీఫ్ నియోనాటాలజిస్ట్ మాట్లాడుతూ కుటుంబం నుంచి మద్దతు అవసరం ఉంటుంది. కొలాస్టమీ బ్యాగ్ పెట్టడం వల్ల తల్లిదండ్రులకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. బ్యాగ్ ఎప్పటికప్పుడు మార్చడం, చర్మం మీద ఇబ్బంది నివారించడం, ఆహారంలో మార్పులు, వైద్యుల వద్దకు ఎప్పుడు తీసుకెళ్లాలో తెలియడం లాంటివి వారికి సమస్యగా మారుతాయి. దీని గురించి అవగాహన లేకపోవడంతో సామాజికంగా కూడా ఇది సమస్య అవుతుంది. అందుకే కిమ్స్ కడల్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పీడియాట్రిక్ కొలాస్టమీ సపోర్ట్ గ్రూప్ ఇలాంటివారికి కావల్సిన మద్దతు అందిస్తుంది. ఇందులో భాగంగా తల్లిదండ్రులకు అవసరమైన శిక్షణ, సూచనలు, కొలాస్టమీ బ్యాగ్ నిర్వహణ తీరుపై అవగాహన కల్పిస్తారు. ఇలాంటి సమస్యలే ఉన్న ఇతర కుటుంబాలతో వీరిని కలపడం ద్వారా పరస్పరం మద్దతు ఉండేలా చూస్తారు. శస్త్రచికిత్సలు ఎప్పుడు అవసరమో, దానివల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో చెబుతారు. స్టోమా పరిశుభ్రత, ఆహారం, సమస్యలను త్వరగా గుర్తించడంపై నిపుణులైన నర్సులు, సర్జన్లు స్పష్టత అందిస్తారు. దీనివల్ల ఆయా కుటుంబాలకు ఒంటరితనం దూరమవుతుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 29న జాతీయ పీడియాట్రిక్ సర్జరీ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. పిల్లల జీవితాలను మెరుగుపరచడంలో పీడియాట్రిక్ సర్జన్లు పోషించే పాత్రను గౌరవించడమే దీని లక్ష్యం. ఈ సందర్భంగా పిల్లలకు చేసే శస్త్రచికిత్సలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, సరైన సమయానికి వైద్యుల సాయం తీసుకునేలా తల్లిదండ్రులను ప్రోత్సహించడం,తాత్కాలికంగా ఏర్పాటుచేసే స్టోమాలపై సమాజంలో ఉన్న అపోహలను తొలగించడం లాంటి కార్యక్రమాలను కిమ్స్ కడల్స్ ఆస్పత్రి వైద్యుల బృందం చేపడుతోంది అని ఆయన వివరించారు.
