హైదరాబాద్, డిసెంబర్ 30:
(జే ఎస్ డి ఎం న్యూస్ ) :
తెలంగాణ పర్యాటక రంగం దేశానికే దిక్సూచిగా మారాలని, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పర్యాటకులను ఆకర్షించేలా వినూత్న మార్పులు తీసుకురావాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. మంగళవారం తారామతి బరాదరిలో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ
(టి జి టి డి సి ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘టూరిజం అండ్ ఇట్స్ విజన్ 2026’ మేధోమథన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం టి.జీ.టి.డి.సి రూపొందించిన ‘టేబుల్ క్యాలెండర్’ -2026 ను ఆవిష్కరించారు. ఈ సదస్సులో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎండీ క్రాంతి వల్లూరు, నిథమ్ డైరెక్టర్ వెంకటరమణ, ఆర్కియాలజీ డైరెక్టర్ డాక్టర్ అర్జున్ రావు, తదితరులు పాల్గొని, పర్యాటక అభివృద్ధిపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.ప్రస్తుతం ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్‌గా మారింది. పర్యాటక రంగంలో మనం కొత్తగా ఏవోఅద్భుతాలు సృష్టించాల్సిన అవసరం లేదు. మనకు ప్రకృతి ప్రసాదించిన వనరులు, వారసత్వ సంపద పుష్కలంగా ఉన్నాయి. వాటికి మెరుగులు దిద్ది, సరైన పద్ధతిలో ప్రపంచానికి పరిచయం చేస్తే చాలు. దేశ, విదేశీ పర్యాటకులు సైతం తెలంగాణ వైపు చూసేలా మన ప్రణాళికలు ఉండాలి అని దిశానిర్ధేశం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని అద్భుతాలను నగరవాసులకు, రాష్ట్ర విశిష్టతలను దేశ, అంతర్జాతీయ పర్యాటకులకు చేరువ చేయడమే మన లక్ష్యం కావాలి” అని స్పష్టం చేశారు. పర్యాటకులకు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలతో పాటు గిరిజన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఆచారాలను పరిచయం చేయాలి. అదేవిధంగా ప్రకృతితో మమేకమై ఎక్కడో కొండకోనల్లో జీవిస్తున్న ఆదివాసీలు, గిరిజనులకు నగరంలోని చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద, ఆకాశహర్మ్యాలు, మెట్రో రైళ్లు నగరవాసుల ఆధునిక జీవన శైలిని తెలియజేసే విధంగా కార్యచరణ రూపొందించాలని అన్నారు.పర్యాటక ప్రదేశాలకు కేవలం వచ్చి వెళ్లడం కాకుండా, పర్యాటకులు అక్కడ కనీసం రెండు రోజులు బస చేసేలా (స్టే ) ఆకర్షణీయమైన వాతావరణాన్ని సృష్టించాలి. కనీస వసతి సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలి. కేవలం సందర్శన మాత్రమే కాదు. వసతి, భోజనం, రవాణా వంటి మౌలిక సదుపాయాల్లో నాణ్యత పెరగాలి. ఐటీ కారిడార్లు, భారీ మాల్స్, విద్యాసంస్థల్లో మన పర్యాటక ప్రచార చిత్రాలు పర్యాటకులను ఆకర్శించేలా ఉండాలి. సంస్కృతిని ప్రతిబింబించే కళారూపాలు, వినూత్న స్కిట్స్ ద్వారా పర్యాటకులను ఆకట్టుకోవాలి. హాస్పిటాలిటీలో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలి, కేరళ లాంటి రాష్ట్రాలతో మనం పోటీ పడాలి. ఆ దిశగా కార్యచరణ ఉండాలి” అని దిశానిర్దేశం చేశారు. భాషా సమస్యలు, నైపుణ్యం కలిగిన గైడ్ల కొరతను అధిగమించాలని సూచించారు. పర్యాటక శాఖలో సమూల సంస్కరణలు తీసుకురావడానికి నేను పూర్తి మద్దతు ఇస్తాను. అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పని చేసి తెలంగాణ పర్యాటక రంగాన్ని అద్బుతంగా తీర్చిదిద్దాలి అని సూచించారు.ఈ వర్క్ షాపులో వివిధ జిల్లాల నుంచి వచ్చిన పర్యాటక శాఖ అధికారులు, హరిత హోటల్ యూనిట్ మేనేజర్లు, నిథమ్, హెరిటేజ్ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పర్యాటక అభివృద్ధికి సహకారం, భాగస్వామ్యం, విలువైన సలహాలు, సూచనలు అందించిన, అధికారులు, సిబ్బందికి ప్రశంస పత్రాలనుఈ సందర్భంగా అందజేశారు.
