తెలంగాణ వాస్తవిక చరిత్ర,పరిశోధనలకు దిక్సూచి.తెలంగాణ చరిత్ర మూలాలు’ పుస్తకం.

హైదరాబాద్ జనవరి 4
(జే ఎస్ డి ఎం న్యూస్) :
తెలంగాణ వాస్తవిక చరిత్ర, మూలాలు పుస్తకం రాబోయే రోజుల్లో తెలంగాణ పరిశోధనలకు దిక్సూచిగా నిలుస్తుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. సీనియర్ పాత్రికేయులు కట్టా శేఖర్ రెడ్డి రచించిన పరిశోధనాత్మక గ్రంథం తెలంగాణ చరిత్ర మూలాలు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం రవీంద్రభారతి వేదికగా ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ వాస్తవిక చరిత్రను ఆవిష్కరించుకునే పరిశోధన మార్గంలో సీనియర్ సంపాదకులు, రచయిత కట్టా శేఖర్ రెడ్డి రచించిన ‘తెలంగాణ చరిత్ర మూలాలు’ పుస్తకం దిక్సూచి వంటిదని సీనియర్ సంపాదకులు, రచయితలు, చరిత్ర పరిశోధకులు అభివర్ణించారు. పుస్తకంతో తెలుగు రాష్ట్రాల చరిత్ర, సంస్కృతి, తెలుగు భాష, ఆంధ్ర భాష, చరిత్రలు కొత్త మలుపులుతిరుగబోతున్నాయని అన్నారు. తెలంగాణ చరిత్ర స్థిరీకరణకు మరిన్ని పరిశోధనలు జరుగాలని కోరారు. ఆదివారం హైదరాబాద్ రవీంద్ర భారతి వేదికగా ‘తెలంగాణ చరిత్ర మూలాలు’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో కే. రామచంద్రమూర్తి పుస్తకాన్ని ఆవిష్కరించి, తొలి కాపీని నాగారం సర్పంచ్, పుస్తక రచయిత కట్టా శేఖర్‌రెడ్డి మామ గుంటకండ్ల రామచంద్రారెడ్డికి అందించారు. ఈ సందర్భంగా కే. రామచంద్రమూర్తి మాట్లాడుతూ.చరిత్ర అంటేనే మార్పులు, కూర్పులతో కూడిందని అన్నారు. దేశంలో విజేతలు చరిత్రను రాసుకున్న ఆనవాయితీ కొనసాగడంతో అసలు చరిత్ర ఏమిటన్నది నిత్య సత్యశోధనగా కొనసాగుతుందన్నారు. స్వరాష్ట్రంలో తెలంగాణ చరిత్రను రాసుకునే టైమ్ వచ్చిందని, ఈ క్రమంలోనే కట్టా శేఖర్ రెడ్డి తెలంగాణ మూలలు పుస్తకంతో తెలుగు భాష, తెలంగాణ చరిత్ర పరిశోధనపై లోతైన పరిశోధన చేశారని కొనియాడారు. తెలంగాణ చరిత్రపై మరిన్ని పరిశోధనలు రావాల్సిన పరిస్థితిని కల్పించడంలో పుస్తక రచయితవిజయవంతమయ్యారని ప్రశంసించారు. తెలంగాణ చరిత్ర మూలాలు పుస్తకంతో తెలుగు రాష్ట్రాల చరిత్ర, సంస్కృతి, తెలుగు భాష, ఆంధ్ర భాష, చరిత్రలు కొత్తమలుపులుతిరుగబోతున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. పుస్తకంలోని అంశాలు ప్రాచీన తెలంగాణ వైభవాన్ని ఘనంగా చాటే ప్రయత్నం చూస్తే కట్టా శేఖర్ రెడ్డిని కట్టర్ తెలంగాణవాదిగాచెప్పవచ్చన్నారు. జాతీయ స్థాయిలో బ్రిటిష్ పాలకులు రాసిందే చరిత్రగా మిగిలిపోయిందని కే. రామచంద్రమూర్తి అన్నారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ భావజాల చొరవతో కొత్త జాతీయ చరిత్రను ప్రజల ముందుకు తెచ్చే ప్రయత్నం జరుగుతున్నదని చెప్పారు. ఏ చరిత్ర కూడా శాశ్వతం కాదని, ఇది కూడా మార్పులకు లోనవ్వడం తథ్యమని స్పష్టం చేశారు.తెలంగాణ చరిత్రను స్థిరీకరించాలి : జీ .జగదీశ్ రెడ్డి
తెలంగాణ చరిత్రను, భాష, సంస్కృతులను అణిచివేసే కుట్రలు ఉమ్మడి రాష్ట్రంలో అనేకం జరిగాయని మాజీ మంత్రి జీ. జగదీశ్ రెడ్డి అన్నారు. అయితే స్వరాష్ట్రం ఏర్పాటు తర్వాత మన చరిత్ర, భాషలను స్థిరీకరించుకునే ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో జరుగలేదని విచారం వ్యక్తం చేశారు. కట్టా శేఖర్ రెడ్డి తెలంగాణ చరిత్ర మూలాలు పుస్తకంతో తెలంగాణ భాష, చరిత్ర పరిశోధనలపై గొప్ప ప్రయత్నం చేశారని అభినందించారు. ఇది ప్రారంభం మాత్రమేనని, ఈ పుస్తకంలో పేర్కొన్న అంశాలపై ఆంధ్రావాళ్ల నుంచి ప్రతిస్పందనలు తప్పక వస్తాయన్నారు. చరిత్ర పరిశోధనలు ఎంత తవ్వితే.. ఎంత చిలికితే అంతా మంచిదని చెబుతూ.. తెలంగాణ చరిత్ర స్థిరీకరణకు మరిన్ని పరిశోధనలు జరుగాలన్నారు.
వైరుధ్యాలపై విస్త్రృత పరిశోధన : కే శ్రీనివాస్
తెలంగాణ చరిత్ర పుస్తక రచనతో రచయిత కట్టా శేఖర్ రెడ్డి ఆంధ్ర, తెలుగు, తెనుగు భాషల మధ్య వైరుధ్యాలపై విస్త్రృత పరిశోధన చేశారని ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్, తెలంగాణ చరిత్ర మూలాలు పుస్తక ముందుమాట రచయిత కే. శ్రీనివాస్ ప్రశంసించారు. పుస్తకం చదువుతుంటే థ్రిల్లర్ నవలను, కాల్పనిక నవలను చదువుతున్నట్టు ఆసక్తికరంగా సాగుతుందని చెప్పారు. తెలంగాణ చరిత్రపై ప్రాంతీయ ఆధిపత్య శక్తుల ప్రభావం నుంచి స్వీయ అస్థిత్వం, ఆత్మగౌరవంతో కూడిన చరిత్రను ఆధారాలు, పరిశోధనలతో చెప్పే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. తెలుగు భాష తెలంగాణకు చెందినదని.. త్రిలింగ, తెనుగు, తెలంగాణ భావనను తొక్కిపెట్టేందుకు ఆంధ్ర భాష, సంస్కృతిని పైకి తెచ్చారని చెప్పే ప్రతిపాదనలను చేశారని తెలిపారు. ఆంధ్ర పదాన్ని జాతి, సంస్కృతి, భాషా వాచకంగావాడుతున్నారన్నారని గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో తెలుగు మీద ప్రాంతీయ ఆధిపత్యం కోణం ఏమైనా ఉందా అనే పరిశోధనతో కట్టా శేఖర్ రెడ్డి త్రిలింగ దేశం, తెనుంగు, తెలింగ, తెలంగాణ ప్రతిపాదనలను చేసి తెలంగాణ, ఆంధ్ర చరిత్రలపై మరింత పరిశోధన చేయడంపై ఆసక్తిని పెంచేశారని అభివర్ణించారు. నన్నయ్య పూర్వం వేదాలు, పురాణాలు వంటి వాటిలో మినహా ఆంధ్ర ప్రస్తావనపై లిఖిత ఆధారాలు లేవని, చరిత్ర వివాదాలన్నీ వర్తమాన అవసరాలుగా, రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆధిపత్య భావజాల, భాష సంఘర్షణలు కొన సాగుతూనే ఉన్నాయన్నారు.
తెలంగాణ చరిత్రను పునర్నిర్వచించే యత్నం : ఘంటా చక్రపాణి.
భారత దేశ చరిత్రతో పాటు, ఆంధ్రులు, తెలంగాణ చరిత్ర కూడా వక్రీకరణలతో సాగాయని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఘంటా చక్రపాణి అన్నారు. ఈ పరిస్థితులో తెలంగాణ చరిత్ర మూలాలు రచనతో కట్టా శేఖర్ రెడ్డి తెలంగాణ చరిత్రను తిరగరాసే, పునర్నిర్వచించే ప్రయత్నం చేశారని అభినందించారు. బ్రిటిషర్లు రాసిందే చరిత్ర అన్నట్లుగా ఇప్పటిదాకా సాగిందని, ఇప్పుడు వేదాలు, ఇతిహాసాలు, పురాణాల ప్రాతిపదికగా దేశ చరిత్రను సనాతన ధర్మం ప్రాతిపదికగా కొత్తగా రాసే దుర్మార్గ ప్రయత్నాలు సాగుతున్నాయని పేర్కొన్నారు. దీంతో దేశంలోని భిన్నత్వం నశించి ఏకత్వం ప్రబలే అవకాశం ఉందని హెచ్చరించారు. హైందవత్వానికి అతీతమైన చరిత్రను భారత చరిత్రగా చూడలేకపోతున్నారని ఆరోపించారు. సింహాలు తమ చరిత్రను చెప్పుకోనంతవరకు వేటగాడు చెప్పిందే చరిత్ర అవుతుందని ఘంటా చక్రపాణి వ్యాఖ్యానించారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో మన చరిత్రను మనం చెప్పుకోవాలని, ఈ దిశగా ప్రభుత్వం కూడా పరిశోధనలను ప్రోత్సహించాలని సూచించారు.
శేఖర్ రెడ్డి పుస్తకంతో కొత్త చర్చ : అల్లం నారాయణ
ఉమ్మడి రాష్ట్రంలో భాష, సంస్కృతుల అస్తిత్వం కోల్పోయిన తెలంగాణకు స్వరాష్ట్రంలో చరిత్ర నిర్మాణం, భాషలపై జరుగాల్సిన పరిశోధనలు జరుగలేదని సీనియర్ సంపాదకులు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ చరిత్ర మూలాల రచనతో కట్టా శేఖర్ రెడ్డి తెలంగాణ చరిత్ర, భాషలపై ఆసక్తికర చర్చను లేవనెత్తారని అభినందించారు. తెలంగాణ భాష, చరిత్ర చర్చ జరిగిన ప్రతిసారి ఆంధ్ర ఆధిపత్యశక్తుల నుంచి ప్రతివాదన ఎదురవుతుందన్నారు. తెలంగాణ చరిత్ర, మూలాలు, తెలుగు భాషా తెలంగాణ చరిత్ర అనుబంధాలను శాసనాలు, ఆధారాలతో ఒక కూర్పుగా తీసుకురావడంలో శేఖర్‌రెడ్డిసఫలీకృతులయ్యారన్నారు. ఇదే శాశ్వతం కాదని.మరిన్ని పరిశోధనలతో ఈ చరిత్ర మారుతునే ఉంటుందని,తెలంగాణ నిర్మాణాత్మక చరిత్రకు ఈ పుస్తకం దోహదం చేస్తుందన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ మాట్లాడుతూ చరిత్రను ఎప్పుడూ ఎవరూ పూర్తిగా రాయలేరని అన్నారు. దేశ, రాష్ట్ర చరిత్రలు కూడా ఆక్రమణలకుగురయ్యాయన్నారు. ఆంధ్ర ప్రాంతం వారు ఆది కవి నన్నయ్య కంటే ముందు తెలుగు లేదంటారనీ,దానికి సమాధానంగా అంతకుముందే తెలంగాణలో తెలుగు, తెనుంగు భాషతో తెలంగాణ గొప్ప జనపదంగా విలసిల్లిందని తెలంగాణ చరిత్ర మూలాలు పుస్తకంతో కట్టా శేఖర్ రెడ్డి నిరూపించే ప్రయత్నం చేశారని కొనియాడారు. సాక్షి ఎడిటర్ వర్ధెల్లి మురళి మాట్లాడుతూ తెలంగాణ చరిత్రను పునర్‌నిర్మించే ప్రయత్నంలో కట్టా శేఖర్ రెడ్డి తెలంగాణ చరిత్ర మూలాలు పుస్తకంతో గొప్ప పరిశోధనాత్మక ప్రయత్నం చేశారన్నారు. ఆంధ్ర, తెలుగు, తెలంగాణ చరిత్రలకు సంబంధించి తన రచనతో కొత్త చర్చను ప్రారంభించారని తెలిపారు. ఇరిగేషన్ అంశాలపై గతంలో ఆసక్తికర పుస్తకం రచించిన శేఖర్ రెడ్డికి పరిశోధన అలవాటుగా మార్చుకున్నారన్నారు. జాతీయ స్థాయిలో చరిత్రలో మార్పులకు దుర్మార్గ ప్రయత్నాలతో నిజమైన చరిత్ర మరుగున పడే ప్రమాదం ఉందన్నారు.ఏదైనా అంశంపై గత చరిత్రను అన్వేషించే స్వీయ ఆస్తక్తి తెలంగాణ చరిత్ర మూలాలు పుస్తక రచన వైపు తనను నడిపించిందని పుస్తక రచయిత కట్టా శేఖర్ రెడ్డి చెప్పారు. తమిళ భాషకు ప్రాచీన హోదా అంశంతో తెలుగు భాషపై మూలాలపై ఆసక్తి పెరిగిందని తెలిపారు. 1000 ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగు భాషకు ప్రాచీన హోదా ఇవ్వడాన్ని మద్రాసు హైకోర్టులో సవాల్ చేయడం కూడా తనను తెలుగు భాషా చరిత్రపై ఆసక్తిని పెంచిందన్నారు. తెలుగు మూలాలు పరిశోధన చేసే క్రమంలో రాజరాజచోళుడు ఆదికవి నన్నయ్యను మహాభారతాన్ని తెలుగులో రాయమని కోరడం.. ఆయన కూడా తెలుగులోనే రాస్తానని చెప్పారని అయితే.. అది కాస్తా అంధ్ర మహాభారతంగా మారిందన్నారు. దీంతో తెలుగు పదాన్ని.. తెలంగాణ చరిత్రను ఉద్దేశ పూర్వక నిర్లక్ష్యం చేశారన భావన తనలో బలపడిందని చెప్పారు. తెలంగాణ చరిత్రను గుర్తించాల్సి వస్తుందన్న భయంతోనే తెలుగు, తెనుంగు పదాలు ఆంధ్ర పరిశోధకులకు మింగుడు పడనివిగా మారాయన్నారు. తెలుగు మూలం తెనుగు అని స్థిరీకరించారని.. అంతకుముందు తెలుగు లేదా అన్న ప్రశ్నతో తాను పరిశోధన చేసి పుస్తకాన్ని తెచ్చానని తెలిపారు. తెలుగు, తెలంగాణ లింక్ తో తన పరిశోధనను కొనసాగించి చారిత్రక ఆధారాలు, శాసనాలతో తెలంగాణ చరిత్ర మూలాలు రచన చేశానని వివరించారు. ఇది మాత్రమే తెలంగాణ చరిత్ర అని తాను నిర్ధారించడం లేదని.దీనిపై మరిన్ని పరిశోధనలు జరుగాల్సి ఉందని శేఖర్‌రెడ్డి అన్నారు.
ఈ పుస్తకానికి ముందుమాట రాసిన కే శ్రీనివాస్ తదితరులు లేవనెత్తిన ప్రశ్నలకు భవిష్యత్తులో సమాధానం చెప్పే ప్రయత్నాలు చేస్తాననన్నారు. దిశ ఎడిటర్ మార్కండేయులు మాట్లాడుతూ తెలంగాణ మూలాలు చరిత్ర పుస్తకంతో కట్టా శేఖర్‌రెడ్డి ఈ తరంలో తెలంగాణ చరిత్ర మూలాలపై ఆసక్తిని పెంచారన్నారు. సీనియర్ న్యూస్ ఎడిటర్ కోవెల సంతోష్ కుమార్ పుస్తక పరిచయం, వందన సమర్పణ చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *