రైతుల పరిస్థితి అమ్మ పోతే అడవి కొన పోతే కొరవి వలే తయారు అయిందని రైతులు వాపోతున్నారు. ఆరు కాలం కష్టపడి పండించిన పంటలకు ఒక వైపు గిట్టుబాటు ధరలు లేక విల విల లాడుతుంటే వేసిన పంటలకు అవసరమైన రసాయనిక ఎరువులు ముఖ్యంగా యూరియా సరిపడ నంత అందుబాటులోనికి రాక పోవటంతో రైతులు విల విల లాడుతున్నారు. గుడ్డిలో మెల్ల వలే గత పది రోజుల క్రితం వరకు రైతులకు ఎకరాకి బస్తా చొప్పున అసలు ధర రూ. 270కే అందించిన సొసైటీలకు గత పది రోజుల నుండి యూరియా నిల్వలు లేక పోవటంతో రైతులు యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలో యూరియా సరఫరాపై అధికారులు జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస రావు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన సూచనలు చేస్తూ నిల్వలు సరిపడనంత ఉన్నాయని చెబుతున్నా సరే క్రింద స్థాయిలో రైతులకు అవసరమైన మేర అందటం లేదని రైతులు చెబుతున్నారు. జిల్లాలో ఫెర్టిలైజర్స్ షాపు యజమానులకు 50శాతం, సొసైటీలకు, ఆర్ బికేలకు సగం చొప్పున కేటాయిస్తూ సరఫరా ఇస్తున్నారు. అయితే సొసైటీలకు గత పది రోజుల నుండి యూరియా సరఫరా లేక పోవటంతో ప్రవేట్ వ్యాపారులు ఇష్టారాజ్యంగా యూరియా రేటు ను పెంచి వేసారు. దీంతో పాటు కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే యూరియా ఇస్తామంటూ లింక్ పెట్టటంతో యూరియా కొనాలంటే రైతుల జెబులు చిల్లు పడాల్సిదే నంటూ తప్పనిసరిగా అవసరమైతే తప్ప రైతు ముందుకు సాగని పరిస్థితి నెలకొన్నది. ఆర్బికేలకు అరకొర సరఫరా అవుతున్నా ఇటీవల మాధవరం, శివరామపురం రైతులకు యూరియా వచ్చిన సరే రైతులు వరుసగా నిలబడి యూరియా తీసుకున్నారు. అయితే చివరలో ఉన్న రైతులకు స్టాకు అందని పరిస్థితి ఉన్నది. ఇప్పటి కైనా తాళ్లూరు మండలంలో మన్నేపల్లి,నాగంబొట్ల పాలెం సొసైటీలకు యూరియా సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు.
గత పదిరోజుల నుండి సరఫరా లేదు – గొంది రమణా రెడ్డి (సమర),సొసైటీ
చైర్మన్, మన్నేపల్లి
రైతులకు గత పది రోజుల నుండి సొసైటీలకు యూరియా సరఫరా లేక పోవటంతో అధిక సంఖ్యలో రైతులు సొసైటీల వద్దకు వచ్చి ఖాళీగా వెళ్తున్నారు. అర్బికేలకు ఇస్తున్నా అవి సరిపోయి నంత రాక పోవటంతో యూరియా డిమాండ్గా ఉన్నది. జిల్లా అధికారుల దృష్టికి కూడ తీసుకువెళ్లాను.
సరఫరా చేస్తున్నాము -శ్రీనివాస రావు, జిల్లా వ్యవసాయాధికారి, ఒంగోలు
రైతులకు అవసరమైన మేర యూరియా నిల్వలు ఉన్నాయి.సొసైటీల నుండి ఇండెంట్లు తీసుకున్నాము. వ్యాగన్ రాగానే వారికి సరఫరా చేస్తున్నాము యూరియా లోటు ఎక్కడా లేదు. ఎవైనా సమస్యలు ఉంటే స్థానిక వ్యవసాయాధికారులతో మాట్లాడి సరిచేస్తాను.
