సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదు…ఎమ్మెల్యే తలసాని.

బేగంపేట జనవరి 18
(జే ఎస్ డి ఎం న్యూస్)
సికింద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ను ఏర్పాటు చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఆదివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ 220 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 17 వ తేదీన శాంతి ర్యాలీ కోసం ఈ నెల 5 వ తేదీన దరఖాస్తు చేస్తే ర్యాలీ చేసుకొమ్మని చెప్పిన పోలీసు అధికారులు ఉద్దేశ పూర్వకంగా ర్యాలీకి కొద్ది గంటల ముందు ర్యాలీకి అనుమతి లేదని వాట్సాప్ లో సమాచారం పంపించడం అన్యాయం అన్నారు. ర్యాలీ జరగకుండా పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి ఎక్కడికక్కడ అరెస్ట్ లు, నిర్బంధాలు చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు. ఒక భయానక వాతావరణం కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ పార్టీకి చెందిన కార్పొరేటర్ లు, మాజీ కార్పొరేటర్ లు, నాయకులు, అన్ని వర్గాల ప్రజలు, వివిధ సంఘాల ప్రతినిధులు ఊహించిన దానికంటే పెద్ద సంఖ్యలో హాజరయ్యారని, వారందరికీ ఆయన అభినందనలు తెలిపారు. అరెస్ట్ చేసిన వారిని వివిధ పోలీసు స్టేషన్ లకు తరలించి విడుదల చేసే విషయంలో కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. ఇదే స్ఫూర్తితో ఫిబ్రవరి మొదటి వారంలో రెట్టింపు ఉత్సాహంతో భారీ ర్యాలీ నిర్వహించుకుందామని, న్యాయస్థానం నుండి అనుమతి తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోకుంటే సికింద్రాబాద్ బంద్ కు కూడా పిలుపునిస్తామని చెప్పారు. సికింద్రాబాద్ చరిత్ర, అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు చేసే పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్చంద సంస్థలు, వివిధ వ్యాపార, వాణిజ్య, కార్మిక సంఘాలు కలసి రావాలని పిలుపునిచ్చారు. ఎంతో ప్రశాంతంగా ఉండే నార్త్ జోన్ లో వివిధ వర్గాలు, వివిధ ప్రాంతాలు, వివిధ భాషలకు చెందిన ప్రజలు కలసి మెలసి ఉంటారని, వీరి మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తుందని అన్నారు. సికింద్రాబాద్ జీ హెచ్ ఎం సి లోనే ఉందని చెప్పే ముఖ్యమంత్రి నార్త్ జోన్ లోని పోలీస్ సర్కిల్స్, జీ హెచ్ ఎం సీ సర్కిల్స్, డివిజన్ లను మల్కాజిగిరి జోన్ లో ఎలా కలిపారని ప్రశ్నించారు. అనంతరం నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, సీనియర్ సిటీజన్స్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, కార్పొరేటర్ లు టి. మహేశ్వరి, శైలజ, ప్రసన్న, సునీత, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్, బి ఆర్ ఎస్ డివిజన్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, కొలన్ బాల్ రెడ్డి, ఆకుల హరికృష్ణ, హన్మంతరావు, నాయకులు నాగులు, శ్రీహరి, కిషోర్ కుమార్, ప్రవీణ్ రెడ్డి, సురేష్ గౌడ్, మహేష్ యాదవ్, అశోక్ యాదవ్, కరుణాకర్ రెడ్డి, ఖలీల్, టి ఎన్ శ్రీనివాస్, కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు మహేశ్వర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *