సంక్షేమ ప‌థ‌కాల‌కు ఆద్యుడు ఎన్టీ రామారావు – ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వి కుమార్

ప్ర‌స్తుతం అమ‌లవుతున్న అనేక సంక్షేమ ప‌థ‌కాల‌కు మాజీ ముఖ్య‌మంత్రి, స్వ‌ర్గీయ ఎన్టీ రామారావు ఆద్యుడ‌ని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వి కుమార్ స్ప‌ష్టం చేశారు. సోమ‌వారం అద్దంకి నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి గొట్టిపాటి ప‌ర్య‌టించారు. కొప్ప‌రం, ప‌త్తేపురం గ్రామాల్లో నందమూరి తారక రామారావు విగ్ర‌హాల‌ను ఆవిష్క‌రించారు. విగ్ర‌హావిష్క‌ర‌ణ అనంత‌రం కొప్ప‌రం గ్రామంలో గ్రీవెన్స్ నిర్వ‌హించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. విగ్ర‌హావిష్క‌ర‌ణ‌ల అనంత‌రం మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ.. వ‌రి అన్నం తినే ప‌రిస్థితులు లేని రోజుల్లో పేద‌వాడు కూడా సంతృప్తిగా భోజ‌నం చేయాల‌నే ఆలోచ‌న‌తో కిలో బియ్యం రెండు రూపాయిలకు ప‌థ‌కాన్ని ఎన్టీ రామారావు ప్రారంభించార‌ని వెల్ల‌డించారు. అదే విధంగా తొలిసారి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత ఎన్టీఆర్ ప్ర‌వేశ పెట్టిన మ‌హిళ‌ల‌కు ఆస్తిలో స‌మాన హ‌క్కు, పేద‌ల‌కు ప‌క్కా ఇళ్లు, విద్యార్థుల‌కు గురుకుల పాఠ‌శాల‌లు వంటి ప‌థ‌కాలు చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచి పోయాయ‌ని గుర్తు చేశారు. ఇటువంటి ఎన్నో సంక్షేమ ప‌థ‌కాల‌ను అనంత‌ర కాలంలో దేశంలోని అనేక రాష్ట్రాలు ఆద‌ర్శంగా తీసుకుని అమ‌లు చేస్తున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తెలుగోడి ఆత్మ గౌర‌వం కోసమే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే, సీఎం చంద్ర‌బాబు నాయుడు తెలుగు వారి కీర్తిని ప్ర‌పంచ స్థాయికి తీసుకెళ్లార‌ని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కొనియాడారు. భావి త‌రాల భవిష్య‌త్తు కోస‌మే చంద్ర‌బాబు అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్నార‌న్నారు. ఉద్యోగాల కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ‌త బెంగ‌ళూరు, హైద‌రాబాద్ కు వెళ్లాల్సిన ప‌రిస్థితులు ఉన్నాయ‌న్నారు. రాష్ట్ర యువ‌త‌కు ఇక్క‌డే ఉద్యోగాలు రావాల‌నే త‌ప‌న‌తోనే రాష్ట్రంలో ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు, పెట్టుబ‌డుల కోసం సీఎం చంద్ర‌బాబు ఎంతో కృషి చేస్తున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. అద్దంకి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని గుడిపాడు, కుంద‌ర్తి గ్రామాల ప‌రిధిలో రైతుల స‌హ‌కారంతో వెయ్యి ఎక‌రాలు తీసుకుని విండ్ ఎన‌ర్జీ మానిఫ్యాక్చ‌రింగ్ హ‌బ్ తో పాటు సోలార్ ప్యానల్ త‌యారీ ప‌రిశ్ర‌మ‌ల‌ను ఏర్పాటుకు ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు తెలిపారు. ఇటువంటి పెద్ద ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు అయితే అద్దంకి ప‌రిస‌ర ప్రాంతాల యువ‌త‌కు కొంత‌మేర ఉద్యోగాలు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని మంత్రి చెప్పారు. అద్దంకిని ప్ర‌కాశం జిల్లాలో క‌ల‌ప‌డంతో పాటు అద్దంకి రెవిన్యూ డివిజ‌న్ ఏర్పాటు కూడా సీఎం చంద్ర‌బాబు వ‌ల్లే జ‌రిగింద‌న్నారు.

రోడ్లు నిర్మాణంతో మౌలిక వ‌స‌తుల ఏర్పాటు…

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పడిన 18 నెల‌ల కాలంలోనే అద్దంకి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో సుమారు రూ.90 కోట్ల‌తో వివిధ‌ ర‌హ‌దారుల నిర్మాణం చేప‌ట్టామ‌ని మంత్రి గొట్టిపాటి స్ప‌ష్టం చేశారు. వైసీపీ ప్ర‌భుత్వ ఐదేళ్ల కాలంలో ఒక్క రోడ్డు కూడా వేయ‌లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. అద్దంకి నియోజ‌వ‌ర్గానికి మ‌రో 30 ఏళ్లు ఎటువంటి ఇబ్బందులూ లేని విధంగా మౌలిక వ‌స‌తుల‌ను అభివృద్ధి చేస్తున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. అద్దంకి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని 100కిపైగా గ్రామాల్లో అవ‌స‌ర‌మైన కొత్త విద్యుత్ స్తంభాల‌ను ఏర్పాటు చేశామ‌ని, 7 స‌బ్ స్టేష‌న్ల నిర్మాణం కూడా చేప‌డుతున్నామ‌న్నారు. వైద్య ప‌ర‌మైన ఇబ్బందుల‌ను తొల‌గించ‌డానికి నియోజ‌క‌వ‌ర్గం మొత్తం 30 స‌బ్ హెల్త్ సెంట‌ర్ల నిర్మాణానికి మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ రూ.10 కోట్లు నిధులు కూడా మంజూరు చేశార‌ని మంత్రి చెప్పారు. కూట‌మి అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్ర‌కారం సామాజిక పింఛ‌న్ల‌ను పెంచ‌డంతో పాటు వైసీపీ ప్ర‌భుత్వం అర్థంత‌రంగా నిలిపి వేసిన ల‌క్ష‌న్న‌ర వితంతు పెన్ష‌న్ల‌ను ఒకేసారి మంజూరు చేశామ‌ని ఆయ‌న చెప్పారు. గ్రామాల్లో గ్రూపులు లేకుండా అంద‌రూ క‌ల‌సి ఉండాల‌ని మంత్రి గొట్టిపాటి స్థానిక నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు సూచించారు. అంద‌రూ క‌లసి ఉంటేనే పార్టీ కూడా బ‌లంగా ఉంటుంద‌న్నారు. కార్య‌క్ర‌మంలో టీడీపీ నేత‌ల‌తో పాటు పలువురు కార్య‌క‌ర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *