ఒంగోలు జనవరి 20, (జే ఎస్ డి ఎం న్యూస్) :
రోడ్డు ప్రమాదాల్లో ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ,ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలు కాపాడు కోవచ్చని ఎస్పీ వి.హర్ష వర్ధన్ రాజు అన్నారు.హెల్మెట్ ధారణ తప్పని సరి అని గుర్తించిన దర్శికి చెందిన సాయి లక్ష్మి పౌల్ట్రీ ఫారం యజమాని షేక్ కరిముల్లా సామాజిక బాధ్యతతో ముందుకొచ్చి మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు కి రోడ్డు భద్రతకు తోడ్పడే విధంగా 50 హెల్మెట్లను అందజేశారు.
షేక్ కరిముల్లాను ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్‌ను, ఫోర్ వీలర్ నడిపే వారు సీట్ బెల్ట్‌ను భారంలా కాకుండా, ప్రాణరక్షణ కవచంలా భావించాలని, రోడ్డు ప్రమాదాల్లో సంభవిస్తున్న మరణాలలో అధిక శాతం తలకు తగిలిన తీవ్ర గాయాల వల్ల లేదా సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్ల వాహనం నుండి బయట పడటం వల్ల జరుగుతున్నాయన్నారు.
ఒక చిన్న నిర్లక్ష్యం కుటుంబం మొత్తాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తుందని, మీ కుటుంబం మీ కోసంఇంట్లోఎదురుచూస్తుందని గుర్తుంచుకోండి.జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు వాహనదారులకు మరింత విస్తృతంగా హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలన్నారు.హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు,
వారికి కౌన్సెలింగ్ నిర్వహించి నిబంధనల పట్ల అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.జిల్లా ప్రజలందరూ పోలీసు వారికి సహకరించి, ప్రయాణాల్లో రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తమ ప్రాణాలను కాపాడుకోవాలని ఎస్పీ కోరారు.

