సమన్వయం, సత్వర స్పందనతో ఎలాంటి సమస్యనైనా సమర్థంగా ఎదుర్కోవచ్చని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి
చెప్పారు. మొంథా తుఫాన్ సమయంలో ప్రాణ నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం స్పందించిన తీరే దీనికి నిదర్శనమన్నారు. ఈ తుఫాన్ సమయంలో ఎదురైన పరిస్థితులను, వాటిని అధిగమించిన అనుభవాలను జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు డాక్యుమెంటేషన్ చేయించారు. మంత్రి స్వామితో పాటు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన రావు, సంతనూతలపాడు శాసనసభ్యులు బి.ఎన్. విజయకుమార్, నగర మేయర్ గంగాడ సుజాత, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్ బుధవారం ప్రకాశం భవనంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విపత్తులను ఎదుర్కొనేందుకు తన అనుభవంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రస్థాయి నుంచి దిశ నిర్దేశం చేశారన్నారు. రాష్ట్రస్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లాస్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో అధికార యంత్రాంగం సమన్వయంతో స్పందించిందని మంత్రి అభినందించారు. ఈ తుఫాన్ సమయంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఆస్తి నష్టాన్ని కూడా సాధ్యమైనంతవరకు అధికారులు తగ్గించగలిగారని కొనియాడారు. విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, రోడ్లపై కూలిన చెట్లను గంటల వ్యవధిలోనే తొలగించి సమస్యను పరిష్కరించారని మంత్రి చెప్పారు. అధికంగా వచ్చిన నీటిని చెరువులను నింపేందుకు మళ్లించడం ద్వారా వాటర్ మేనేజ్మెంట్ కూడా అద్భుతంగా చేశారని గుర్తు చేశారు. జిల్లా చరిత్రలోనే కనీవినీ ఎరుగని స్థాయిలో విరుచుకుపడిన తుఫానును సమర్థంగా ఎదుర్కొన్న అనుభవాలను పుస్తక రూపంలో అందుబాటులో ఉంచడం ద్వారా భావితరాలకు ఒక మార్గనిర్దేశంగా ఉంటుందని మంత్రి చెప్పారు.
ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ మాట్లాడుతూ పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం సమన్వయంతో పనిచేయడం ద్వారా మొంథా తుఫాను ఇబ్బందులను సత్వరమే తొలగించగలిగామని అన్నారు. ప్రజా ప్రతినిధులతో అధికారులు సమన్వయం చేసుకోవడం ద్వారా సమస్యను త్వరగా పరిష్కరించగలిగామన్నారు. ఈ అనుభవాలను డాక్యుమెంటేషన్ ద్వారా భావితరాలకు ఒక దిక్సూచిగా ఉంటుందన్నారు.
సంతనూతలపాడు ఎమ్మెల్యే బి ఎన్ విజయకుమార్ మాట్లాడుతూ తుఫాను అతి తీవ్రమైనదైనప్పటికీ దాని వలన కలిగే నష్టాన్ని సాధ్యమైనంత తగ్గించగలిగామన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు చరిత్రలోనే గరిష్ట స్థాయిలో వరద వచ్చినప్పటికీ సమర్థంగా నియంత్రించగలగటం గొప్ప విషయం అన్నారు. ఈ ప్రాజెక్టుకు గేట్లను బిగించే విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న సత్వర నిర్ణయం, విపత్తుల సమయంలో అధికార యంత్రాంగం త్వరగా స్పందించడం వలన రోజుల వ్యవధిలోనే పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురాగలిగామన్నారు.
రియాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న పొలిటికల్ గవర్నెన్స్ వలన నష్ట తీవ్రతను తగ్గించగలిగామన్నారు. ఈ దిశగా చర్యలు తీసుకున్న జిల్లా యంత్రాంగాన్ని ఆయన అభినందించారు.
మేయర్ మాట్లాడుతూ తుఫాను సమయంలో మున్సిపల్ సిబ్బంది చేసిన సేవలను కొనియాడారు. పోతురాజు కాలువలో రూ.80 లక్షలతో పూడికతీత పనులను మే నెలలోనే చేపట్టడము ద్వారా నష్టాన్ని సాధ్యమైనంతగా తగ్గించగలగామన్నారు. ఈ దిశగా కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యేకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
కలెక్టర్ రాజబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సమస్య ఉన్న ప్రాంతాన్ని జియో కోఆర్డినేట్స్ ఆధారంగా గుర్తించి, ఫోటోలు వీడియోలతో డాక్యుమెంటేషన్ చేయించానన్నారు. జిల్లాపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిన ఈ తుఫానుకు సంబంధించిన అనుభవాలను మండలాల వారీగా క్రోడీకరించి రూపొందించిన ఈ పుస్తకం, భవిష్యత్తులో విపత్తులను ఎదుర్కొనడంలో ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ విపత్తులను ఎదుర్కొనడములో అనుభవాలను క్రోడీకరించి పుస్తక రూపంలో తీసుకురావటం ఇదే మొదటిసారి కావచ్చు అని అన్నారు. తుఫాన్ సమయంలో సమన్వయంతో వ్యవహరించటం వలన సత్వరమే ప్రజలకు ఊరట కలిగిందన్నారు.
జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ మాట్లాడుతూ తుఫాన్ సమయంలో ఎదురైన పరిస్థితులను గుర్తు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి వాటిని సమర్థంగా ఎదుర్కొనేలా అనుభవాలకు అక్షర రూపాన్ని ఇవ్వటం ద్వారా మార్గాన్ని సులభతరం చేస్తుందన్నారు.
తుఫానుకు ముందు, తుఫాన్ సమయంలో ఎదురైన సమస్యలను, పరిస్థితిని సత్వరమే చక్కదిద్దడం ద్వారా ఆ తర్వాత నెలకొన్న పరిస్థితులను తెలియజేసేలా రూపొందించిన వీడియోను ప్రజా ప్రతినిధులు వీక్షించారు. ఫోటో ఎగ్జిబిషన్ ను కూడా తిలకించారు. కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్లను ప్రజాప్రతినిధులు సన్మానించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ బి.ఓబులేసు, మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ, ఆర్డీవోలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.





