జిల్లా సర్వతోముఖాభివృద్దికి పలు సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు దిగ్విజయంగా అమలు – జిల్లా కలెక్టర్ పి. రాజబాబుఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

జిల్లా సర్వతోముఖాభివృద్దికి పలు సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు దిగ్విజయంగా అమలు జరుగుచున్నట్లు జిల్లా కలెక్టర్ పి. రాజబాబు
పేర్కొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సోమవారం స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్ నందు కలెక్టర్ పి. రాజాబాబు, జాతీయ పతాకావిష్కరణ గావించి, పోలీసు, ఎన్.సి.సి. దళాలచే గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజాబాబు, జిల్లా ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రగతిపై ప్రసంగిస్తూ, పారదర్శకతతో కూడిన సుపరిపాలన అందించడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు ఆర్హులందరికి అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎనలేని త్యాగాలు చేసిన స్వాతంత్ర్య సమర యోధులకు, భారత రాజ్యాంగం రూపొందించిన రాజ్యాంగ నిర్మాతలకు ఈ సందర్భంగా నా నమస్కారాలని తెలిపారు. 1947 ఆగస్టు 15 వ తేదీ మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మరియు యెందరో మహనీయులు, మేధావుల కృషి వల్ల భారత రాజ్యాంగం రూపొందించబడిందన్నారు. 1950 జనవరి 26 వ తేదీ నుండి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత భారతదేశం సర్వ సత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం గా అవతరించిందని, వికసిత్ భారత్ 2047 లో భాగంగా స్వర్ణాంధ్ర @ 2047 ను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి వ్యవసాయ, పరిశ్రమలు మరియు సర్వీసు రంగాలు వాటి అనుబంధ రంగాలలో 15 శాతము వృద్ధి రేటు సాధించాలనే దృఢ సంకల్పంతో మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. జిల్లా తలసరి అంచనా ఆదాయం 2,15,240 రూపాయలు ఉండగా 15 శాతము వృద్ధి రేటుతో 2028-29 కు 4,27,409 రూపాయలకు పెంపొందించేందుకు తగు ప్రణాళికలు తయారుచేయటమైనదని వివరించారు. జిల్లాలో అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని రాబోయే 5 సంవత్సరాలలో 15% వృద్ధి రేటు సాధించడానికి తయారుచేసిన “డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్” రాష్ట్ర స్థాయిలో 2వ స్థానం పొందినదని, అదేవిధముగా జిల్లాలోని 6 నియోజకవర్గాలకు “విజన్ యాక్షన్ ప్లాన్” అమలుకొరకు గౌరవ శాసన సభ్యుల వారి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయడమైనదని, అదేవిదముగా మండల స్థాయిలో కూడా మండల విజన్ యాక్షన్ ప్లాన్ ను తయారుచేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్వర్ణాంధ్ర సాధనకై ప్రవేశపెట్టిన 10 సూత్రాలు అమలు చేయుట ద్వారా వృద్ధిరేటు సాధించటానికి కృషిచేయటం జరుగుతుందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలన కోసం ప్రత్యేకమైన విధానాన్ని రూపొందించటం ద్వారా మన ప్రజలను విలువైన ఆస్తులుగా గుర్తిస్తూ మరియు మెరుగైన జీవన ప్రమాణాలకు ప్రాధాన్యత ఇస్తూ గౌరవ ముఖ్యమంత్రి చే రూపొందించబడిన ప్రభుత్వ-ప్రైవేటు- ప్రజల భాగస్వామ్యం (పి 4) అనే ఒక వినూత్న విధానాన్ని అమలుపరుస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా మన జిల్లాలో పేదరికంలో అట్టడుగున ఉన్న 79,099 బంగారు కుటుంబాలను గుర్తించి ఇప్పటివరకు 3,753 మంది మార్గదర్సులు, 26,275 బంగారు కుటుంబాలను దత్తత తీసుకొనియున్నామన్నారు. సదరు బంగారు కుటుంబాలకు అవసరమైన ఆర్ధిక మరియు ఆర్థికేతర అవసరాలను సర్వే ద్వారా గుర్తించబడినవి. త్వరలోనే మిగిలిన బంగారు కుటుంబాలను మార్గదర్సులను గుర్తించి 2029 సంవత్సరము నాటికి ఆంధ్రప్రదేశ్ ను పేదరికం లేని స్వర్ణాంధ్రప్రదేశ్ గా రూపు దిద్దుకోవడానికి ప్రణాలికలు సిద్దం చేయడమైనదన్నారు. ఇటీవల కాలంలో జిల్లా యంత్రాంగం వసతి గృహాలను సందర్శించి విద్యార్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను మరియు నిర్వహణ లోపాలను తెలుసుకొనుట జరిగినది. వాటిని పరిష్కరించుటకై ఒక అధికారికి ఒక వసతి గృహమును కేటాయించి జిల్లా అధికారుల ప్రత్యక్ష భాగస్వామ్యంతో మరియు పర్యవేక్షణ ద్వారా సామాజిక సంక్షేమ హాస్టళ్ల పనితీరును బలోపేతం చేయడం జరిగిందని వివరించారు. జిల్లాలోని ప్రజలకు సురక్షితమైన త్రాగునీటిని అందించుటకు గాను జల సురక్ష మాసంలో భాగంగా జిల్లాలో గల మొత్తం 1002 నీటి ట్యాంక్ లను శుభ్రపరిచటం జరిగినది, అలాగే జిల్లాలో 195 పైపులైన్లు లీకేజీలు కనుగొని వాటి మొత్తం లీకేజీలను మరమ్మత్తులు చేసి, నిలిచిపోయిన నీటిని సక్రమంగా సరఫరా అయేలా చేసి నీటి కాలుష్యంను అరికట్టడం జరిగింది. పేలవమైన పరిస్థితులలో ఉన్నటువంటి 17 నీటి ట్యాంక్ లకు పాత పొరలను పూర్తిగా స్క్రాప్ చేసి, ఎమల్షన్ పెయింట్లతో చక్కగా పెయింట్ చేసి, మరియు 101 చోట్ల నీటి వనరుల పరిసరాలు పరిశుభ్రం చేసి, పరిశుభ్రత పరిస్థితులు మెరుగు చేయటం జరిగింది. నిరంతర నీటి సరఫరా కోసం 14 మోటార్లకు మరమ్మతులు చేసి, వాడుకోలేని, పాడు అయినటువంటి 55 కుళాయిలను కొత్త కుళాయిలతో భర్తీ చేయటం జరిగిందని తెలిపారు. జిల్లా సర్వతోముఖాభివృద్దికి పలు సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు దిగ్విజయంగా అమలు జరుగుచున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు :
……………….
ఒంగోలు లోని డ్రీమ్స్ హై స్కూల్ విద్యార్ధులు, అపెక్స్ హై స్కూల్ విద్యార్ధులు, ఒంగోలు అన్నవరపాడు లోని సూర్య హై స్కూల్ విద్యార్ధులు, కొత్తపట్నం, తాళ్ళూరు, ముండ్లమూరు, పొన్నలూరు, కే బిట్రగుంట కెజిబివి విద్యార్ధులు, టంగుటూరు మండలంలోని ఆలకూరపాడు జడ్పి ఉన్నత పాటశాల విద్యార్ధులు, క్విస్ మరియు పేస్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధులచే దేశభక్తి ఉట్టిపడేలా ప్రదర్శించబడిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. కొత్తపట్నం, తాళ్ళూరు, ముండ్లమూరు, పొన్నలూరు కే బిట్రగుంట కెజిబివి విద్యార్ధులు ప్రదర్శించిన రెపరెపలాడే జెండా ప్రదర్శనకు మొదటి బహుమతి లభించగా, డ్రీమ్స్ హై స్కూల్ మరియు టంగుటూరు మండలం లోని ఆలకూరపాడు జడ్పి ఉన్నత పాటశాల విద్యార్ధులు ప్రదర్శించిన ప్రదర్శనలకు సంయుక్తంగా ద్వితీయ బహుమతి, ఒంగోలు అన్నవరపాడు లోని సూర్య హై స్కూల్ విద్యార్ధులు ప్రదర్శించిన ప్రదర్శనకు తృతీయ బహుమతి లభించగా, అపెక్స్ హై స్కూల్ విద్యార్ధులు, క్విస్ మరియు పేస్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధులచే ప్రదర్శించిన ప్రదర్శనలకు ప్రోత్సాహక బహుమతులు లభించగా, సంబంధిత విద్యార్ధులకు, స్కూల్ యాజమాన్య ప్రతినిధులకు జిల్లా కలెక్టర్ రాజాబాబు మెమోంటోలను అందచేశారు. ఈ సందర్భంగా పోలీస్, అగ్నిమాపక శాఖ సిబ్బంది ప్రదర్శించిన కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఆకట్టుకున్న ప్రభుత్వ శకటాలు :
…………………..
గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, పశు సంవర్ధక, సాంఘిక సంక్షేమ, బిసి వెల్ఫేర్, ఐటిడిఎ, విద్య, వైద్య ఆరోగ్య శాఖ, డ్వామా, పంచాయితీ రాజ్, జిల్లా గ్రామీణాభివృద్ది, జిల్లా ప్రజా రవాణా శాఖలు ఆయా శాఖలు అమలు చేస్తున్న సంక్షేమ మరియు అభివృద్ది కార్యక్రమాలపై నిర్వహించిన శకటాల ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకున్నాయి. వేడుకలకు విచ్చేసిన ప్రజలు , ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్దులు ప్రభుత్వ శకటాలను ఎంతో ఆసక్తిగా తిలకించారు.
ఈ శకటాల ప్రదర్శనకు గాను పంచాయతీ రాజ్ శాఖ శకటానికి మొదటి బహుమతి, జిల్లా గ్రామీణాభివృద్ది, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ శకటాలకు సంయుక్తంగా రెండవ బహుమతి, సాంఘిక సంక్షేమ, బిసి వెల్ఫేర్, ఐటిడిఎ సంక్షేమ శాఖల శకటానికి తృతీయ బహుమతి, జిల్లా ప్రజా రవాణా, విద్య, ఉద్యాన శాఖ, వ్యవసాయ శాఖల శకటాలకు ప్రోత్సాహక బహుమతి లభించగా, సంబందిత శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ శ్రీ రాజాబాబు మెమోంటోలను అందచేశారు.

ఆకట్టుకున్న స్టాల్స్ :
…………………….
గణతంత్ర దినోత్సవ వేడుకలను సంధర్భంగా, మైక్రో ఇరిగేషన్, వ్యవసాయ, మెప్మా, జిల్లా గ్రామీణాబివృద్ది సంస్థ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, జల వనరులు, అటవీ శాఖ, జిల్లా నీటి యాజ్యమాన్య సంస్థ, విద్యా శాఖ, ఆర్.డబ్ల్యూ.ఎస్., ప్రణాళిక శాఖ, పరిశ్రమలు, మత్స్య శాఖ, రెవెన్యూ, భూగర్భ గనుల శాఖ, పౌర సరఫరాల శాఖ, స్టెప్, పశు సంవర్ధక శాఖ, తదితర శాఖలు ఆయా శాఖలు అమలు చేస్తున్న పధకాలు, చేపడుతున్న అభివృద్ది పనుల పై ఏర్పాటుచేసిన స్టాల్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన ప్రజలు, విద్యార్ధులు స్టాల్స్ ను ఆసక్తిగా తిలకించడం జరిగింది. , భూగర్భ గనుల శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ కు సంయుక్తంగా మొదటి బహుమతి లభించగా, రెవెన్యూ మరియు ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖలు ఏర్పాటుచేసిన స్టాల్స్ కు సంయుక్తంగా రెండవ బహుమతి, పశు సంవర్ధక శాఖ మరియు స్టెప్ శాఖలు ఏర్పాటుచేసిన స్టాల్స్ కు సంయుక్తంగా తృతీయ బహుమతి లభించగా, సంబందిత అధికారులకు జిల్లా కలెక్టర్ రాజాబాబు మెమోంటోలను అందచేశారు.

ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ ఉధ్యోగులకు ప్రశంసా పత్రాలు :
………………..
జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేసి తమ విధుల పట్ల ఉత్తమ సేవలందించిన 549 మంది ఉద్యోగస్తులకు జిల్లా కలెక్టర్ రాజాబాబు, ప్రశంసా పత్రాలను అందచేశారు.

ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులు కీ.శే ప్రకాశం పంతులు మునిమనవడు సంతోష్ కుమార్, కీ.శే గన్నవరపు వందనం కుమారుడు భాస్కర్ రావు, కీ.శే కరవాది వెంకటేశ్వర్లు కుమార్తె సుబ్బలక్ష్మి, అల్లుడు శేషగిరి రావు, కీ.శే పర్వతం వెంకటేశ్వర రావు కుమారులు రామ్ ప్రసాద్ లను జిల్లా కలెక్టర్ రాజాబాబు సన్మానించడం జరిగింది.

ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా ఎస్పి వి హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, కందుకూరు సబ్ కలెక్టర్ హిమ వంశి, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్, ఏపి టూరిజం డెవెలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ డా. నూకసాని బాలాజీ, ఏపి మాల వెల్ఫేర్ కార్పోరేషన్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ డా. పెదపూడి విజయకుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, స్వాతంత్ర్య సమరయోధులు, వివిధ పాఠశాలల విద్యార్ధిని విద్యార్ధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *