బేగంపేట ఫిబ్రవరి 1,(జే ఎస్ డి ఎం న్యూస్) :
మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉన్నదని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం గాంధీ మెడికల్ కాలేజీ ఆవరణలో మెడికల్ కాలేజీ, జనహిత ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీపీ ఆర్ శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్తీ ఆహారం, కలుషితమైన వాతావరణం వలన కూడా వివిధ రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పారు. మన ముందు జనరేషన్ వారు ఎలాంటి కల్తీ లేని ఆహారం తీసుకోవడం వలన ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని, ఎక్కువకాలం పాటు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవించారని వివరించారు. ప్రస్తుతం మనం కల్తీ ఆహారం తినడం, ఆరోగ్య పరంగా తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన పలు రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నామని చెప్పారు. ప్రస్తుత కాలంలో ప్రధానంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారి సంఖ్య గణనీయంగా పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. గుండెపోటుకు గురైన వారికి తక్షణమే సి పి ఆర్ చేయడం వలన మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించే వరకు బ్రతికించే అవకాశాలు ఉంటాయని అన్నారు. CPR పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కోరారు. సి పి ఆర్ పై ఉచిత శిక్షణ నిర్వహించడం పట్ల నిర్వాహకులను అభినందించారు.
కార్యక్రమంలో నిర్వాహకులు నర్సింహామూర్తి, రవీందర్, డాక్టర్ లు లింగమూర్తి, రాజశేఖర్, నోముల ప్రకాష్, రాజశేఖర్, మహేశ్వర్ రెడ్డి, లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, శ్రీధర్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు ఏసూరి మహేష్, శ్రీకాంత్ రెడ్డి, మహేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


