రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో గుండా వెళ్లే ఏడు జాతీయ రహదారులపై రోడ్డు భద్రతను మరింత పటిష్టం చేయడానికి ప్రత్యేకంగా రోడ్డు సేఫ్టీ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
జాతీయ రహదారుల వారీగా ఏర్పాటు చేసిన టీమ్స్ వివరాలు ఈ విధంగా ఉన్నాయని చెప్పారు. ఎన్.హెచ్-16 లో 8 టీమ్స్, ఎన్ హెచ్-216 లో 2 టీమ్స్, ఎన్ హెచ్-544డి లో 8 టీమ్స్, ఎన్.హెచ్ -565 లో 8 టీమ్స్, ఎన్.హెచ్ -765 లో2 టీమ్స్, ఎన్.హెచ్ -340సి లో 1 టీమ్, ఎన్.హెచ్ -167బి లో 5 టీమ్స్. ఈ రోడ్డు సేఫ్టీ టీమ్స్‌లో పోలీసులు, ఎన్ హెచ్ ఎ ఐ & 1033 సిబ్బంది, టోల్ ప్లాజా సిబ్బంది, ఆర్టీఏ అధికారులు, అలాగే మెడికల్ & హెల్త్ డిపార్ట్మెంట్ (108 సేవలు) కు సంబంధించిన అధికారులు సభ్యులుగా ఉంటారని జిల్లా ఎస్పీ తెలిపారు.
జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలు, బస్సులు–లారీలు నిలిపే రెస్ట్ ఏరియాలు, ఎమర్జెన్సీ పార్కింగ్ ప్రదేశాలు, అనధికార పార్కింగ్ ప్రాంతాలు, బ్లాక్ స్పాట్స్, సర్వీస్ రోడ్డుల నుండి ప్రధాన రహదారికి కలిసే ప్రాంతాలు, అలాగే స్ట్రైట్ గా 5 కిలోమీటర్ వరకు ఉన్న రోడ్డుపై అతివేగ నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై మరియు హైవే పై ఉన్న హోటళ్లు, డాబాల వద్ద తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిన వాటి గురించి జిల్లా ఎస్పీ అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు.
ఆయా ప్రదేశాలలో సీసీ కెమెరాలు, పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టమ్, కాన్వెక్స్ మిర్రర్లు,తగినంత లైటింగ్,రంబుల్ స్ట్రిప్స్ (లైన్స్),ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సర్వీస్ రోడ్డుల నుండి ప్రధాన రహదారికి కలిసే ప్రాంతాల్లో ఇసుక డ్రమ్ములు, స్పీడ్ బ్రేకర్లు, ఇల్ల్యూమినేషన్ ఏర్పాటు చేసి, ప్రమాదాలకు అవకాశం లేకుండా తక్షణమే అవసరమైన అన్ని భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నియంత్రించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
