హైదరాబాద్, ఫిబ్రవరి 6
( జే ఎస్ డి ఎం న్యూస్ ) :
గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలోని తార్నాక డివిజన్లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా నూతన రోడ్డు నిర్మాణ పనులను నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి , టిటియుసి రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తార్నాక డివిజన్లోని పలు ప్రాంతాల్లో మొత్తం రూ.57 లక్షల వ్యయంతో చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గోకుల్ నగర్ కాలనీలో రూ.30 లక్షల అంచనా వ్యయంతో, నాగార్జున నగర్ స్ట్రీట్ నెంబర్–4లో రూ.10 లక్షలతో, అలాగే క్యాంప్ సిక్స్ తిప్పుకా మజీద్ పరిసర ప్రాంతాల్లో రూ.17 లక్షలతో నూతన సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరాభివృద్ధిలో భాగంగా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు, సురక్షిత ప్రయాణ వాతావరణం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. తార్నాక డివిజన్లో దెబ్బతిన్న రోడ్ల కారణంగా ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటుండడంతో నూతన రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చామన్నారు. ఈ పనులు పూర్తయ్యాక స్థానికుల జీవన ప్రమాణం మరింతమెరుగవుతుందన్నారు.అదేవిధంగా, అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత కాలవ్యవధిలో పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ప్రజల అవసరాలను గుర్తించి దశలవారీగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు, ఇంజినీరింగ్ విభాగ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

