నగర పోలీసుల అంకితభావానికి గౌరవం – 1,446 మందికి అవార్డులు అందజేసిన పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ -నగర చరిత్రలో తొలిసారిగా ‘ఎక్స్‌ట్రా మైల్’పురస్కారాలతో సరికొత్త అధ్యాయం.విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ చూపిన వారికి సముచిత గౌరవం

హైదరాబాద్ ఫిబ్రవరి 8
(జె ఎస్ డి ఎం న్యూస్)
విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి, అసాధారణ ప్రతిభ కనబరిచిన 1,446 మంది పోలీసు సిబ్బందికి నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ఆదివారం రివార్డులు అందజేశారు. నగర పోలీసు చరిత్రలో తొలిసారిగా ప్రవేశపెట్టిన ‘ఎక్స్‌ట్రా మైల్‌’ పురస్కారాలతో పాటు ‘గుడ్‌ వర్క్‌ డన్‌’ రివార్డులను పోలీస్ సిబ్బందికి ఉన్నతాధికారులతో క‌లిసి ఆయన ప్రదానం చేశారు.హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (టీజీఐసీసీసీ) వేదికగా ఈ పురస్కారాల ప్రదానోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను అభినందిస్తూ నగర పోలీస్ కమిషనర్ సీపీ వీసీ సజ్జనర్‌ మాట్లాడుతూ పోలీసు వృత్తి కేవలం విధి నిర్వహణ మాత్రమే కాదని, అదొక సామాజిక బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. విధులకు మాత్రమే పరిమితం కాకుండా సమాజం పట్ల జవాబుదారీతనంతో వ్యవహరించాలని, ప్రతి పనిలోనూ సృజనాత్మకత, మానవీయతప్రతిబింబించాలని పిలుపునిచ్చారు. అప్పగించిన పనిని పూర్తి చేయడం కంటే, బాధితులకు ఎంతటి భరోసాను కల్పించామన్నదే అసలైన విజయమని స్పష్టం చేశారు. విధులకు అతీతంగా సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించినప్పుడే పోలీసు వ్యవస్థ పట్ల ప్రజల్లో గౌరవం పెరుగుతుందని పేర్కొన్నారు.
సిబ్బందిలో ఉన్న అసాధారణ ప్రతిభను, వినూత్న ఆలోచనలను, విధులకు అతీతమైన సేవలను గుర్తించి, గౌరవించాలనే ఉద్దేశంతోనే కమిషనరేట్ చరిత్రలోనే తొలిసారిగా ‘ఎక్స్‌ట్రా మైల్‌’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. విధులకు అతీతంగా సమాజానికి మేలు చేసే ప్రతి పోలీసు అధికారిని ఈ వేదిక గౌరవిస్తుందని చెప్పారు. ఇది కేవలం ఒక అవార్డు మాత్రమే కాదని, అంకితభావానికి దక్కిన గుర్తింపు అని అన్నారు. ఈ గుర్తింపు పోలీసుల్లో నూతనోత్తేజాన్ని నింపుతుందని, ఇతరులు నిబద్దతతో పనిచేసేలా ప్రేరణనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సాంకేతికత ఎంత పురోగమించినా, క్షేత్రస్థాయిలో పోలీస్ సిబ్బంది చూపే చిత్తశుద్ధికి, ఆపదలో ఉన్న వారి పట్ల ప్రదర్శించే మానవత్వానికి ఏ టెక్నాలజీ సాటిరాదని గుర్తు చేశారు. హోంగార్డు నుంచి
ఉన్నతాధికారి వరకు ప్రతి ఒక్కరూ ఒకే బృందంగా పనిచేయడం వల్లే నగరంలో శాంతిభద్రతలు సమర్థంగా ఉన్నాయని కొనియాడారు.
ఈ పురస్కారాలు ఇక్కడితో ఆగిపోవని, ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపేందుకు ఇకపై ప్రతి నెల జోనల్ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎస్‌హెచ్‌ఓలు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లకు రివార్డులు అందజేస్తామని తెలిపారు. పోలీస్ సిబ్బంది కృషి, నిజాయితీ వృథా కాదని, కష్టానికి తగ్గ గుర్తింపు కచ్చితంగా ఉంటుందన్నారు.
కాగా, గత ఆర్థిక ఏడాదికి సంబంధించిన 2, 3, 4వ త్రైమాసికాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన వారిని ఈ అవార్డులకు ఎంపిక చేశారు. ఎక్స్ ట్రా మైల్ లో భాగంగా విధి నిర్వహణలో విధులకు అతీతంగా సేవలందించిన 271 మందికి ఈ పురస్కారం దక్కింది. గుడ్‌ వర్క్‌ డన్‌ లో భాగంగా విధుల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 1,175 మందికి ఈ రివార్డులు వరించాయి.పురస్కారాలు అందుకున్న వారిలో అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, హోంగార్డులతో పాటు మినిస్టీరియల్ సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ సీపీ శ్రీ.ఎం. శ్రీనివాసులు, ఐపీఎస్, జాయింట్ సీపీ నార్త్ రేంజ్ ఎన్ .శ్వేత, ఐపీఎస్,డీసీపీలు .ఎస్.చైతన్య కుమార్,
శిల్పవల్లి,.వి.అరవింద్ బాబు, లావణ్య నాయక్ జాదవ్ , కె. వెంక‌ట ల‌క్ష్మి, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *