హైదరాబాద్ ఫిబ్రవరి 16 ,(జే ఎస్ డి ఎం న్యూస్) :
హైదరాబాద్ నగరం మత సామరస్యానికి నిలువెత్తు సాక్ష్యం అని,ఇక్కడి గంగా-జమునా తెహజీబ్ సంస్కృతినికాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందనీ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ పిలుపునిచ్చారు. నేరరహిత సమాజ స్థాపనలో పీస్ కమిటీ సభ్యులు పోలీసులకు, ప్రజలకు మధ్య బలమైన వారధిలా నిలవాలని ఆయన కోరారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆడిటోరియంలో సోమవారం సెంట్రల్ పీస్, వెల్ఫేర్ కమిటీ సమన్వయ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన సీపీ సజ్జనర్ సభ్యులకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో 1984లో ఏర్పాటైన పీస్ కమిటీలు దశాబ్దాలుగా శాంతిభద్రతల పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నాయని గుర్తుచేశారు. నేడు హైదరాబాద్ ప్రపంచ పటంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందంటే, అందులో పీస్ కమిటీలతో పాటు నగర పౌరుల కృషి ఎంతో ఉందన్నారు.రాబోయే పండుగలను అన్ని వర్గాల ప్రజలు సోదరభావంతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా పీస్ కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా మతపరమైన ఉద్రిక్తతలు రేకెత్తించేలా, ప్రజలను భయాందోళనకు గురిచేసేలా వచ్చే అసత్య ప్రచారాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇలాంటి పుకార్లను నమ్మకుండా ప్రజలకు వాస్తవాలను వివరించడంలో సభ్యులు క్రియాశీలకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.ప్రస్తుత తరుణంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల సామాన్య ప్రజలను చైతన్యపరచడంలో పీస్ కమిటీ సభ్యులు చొరవ చూపాలని కోరారు. అలాగే నగరంలో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగాన్ని సమూలంగా అరికట్టడమే లక్ష్యంగా పనిచేయాలనిపిలుపునిచ్చారు. ప్రజలకు, పోలీసులకు మధ్య స్నేహపూర్వక బంధాన్ని బలోపేతం చేస్తూ, హైదరాబాద్‌ను దేశంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.క్షేత్రస్థాయి సమస్యలనుపరిష్కరించేందుకు ఇకపై మూడు నెలలకోసారి జోనల్ స్థాయిలో విధిగా పీస్ కమిటీ సమావేశాలు
నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో సభ్యులు ఇచ్చిన పలు సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ నిరభ్యంతరంగా తమకు సలహాలు ఇవ్వవచ్చని పేర్కొన్నారు.ఈ సమావేశంలో అడిషనల్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీలు డి. జోయల్ డేవిస్, ఎస్.ఎం. విజయ్ కుమార్, ఎన్. శ్వేత తో పాటు పలు జోన్ల డీసీపీలు రక్షిత కృష్ణ మూర్తి, ఖరే కిరణ్ ప్రభాకర్, శిల్పవల్లి,ఎ. రమణా రెడ్డి, బి. రాజేష్, జి. చంద్ర మోహన్, ఎస్. శ్రీనివాస్, ట్రాఫిక్ డీసీపీలు రాహుల్ హెడ్గే, కాజల్, అవినాశ్ కుమార్ లు పాల్గొన్నారు.
సెంట్రల్ పీస్ & వెల్ఫేర్ కమిటీ ప్రధాన కార్యదర్శి కిషన్ శర్మ, వివిధ జోన్ల అధ్యక్షులు శశికాంత్ అగర్వాల్, ఖాజా అబ్దుల్ మోయిజ్, ఖాజా గాజియుద్దీన్, మహమ్మద్ మౌజం అలీ, తేజో విజయ కుమారి, శశి కాంత్ అగర్వాల్, ఎస్. నారాయణ రెడ్డి,ఆర్. ఉమేందర్ కుమార్, తదితరులు హాజరయ్యారు.


