‘ మీకోసం ‘ అర్జీల పరిష్కారంలో సహేతుకత ముఖ్యమని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి
చెప్పారు. ముఖ్యంగా రెవెన్యూ సమస్యలపై
మరింత దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఒంగోలు కలెక్టరేట్ లోని ‘ గ్రీవెన్స్ ‘ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లతో కలిసి ప్రజల నుంచి ఆమె అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ద చూపాలని అధికారులకు సూచించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక మరియు రెవెన్యూ క్లీనిక్ ల ద్వారా వచ్చే అర్జీలను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారులు సంతృప్తిచెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు. పరిష్కరించలేని సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారో అర్జీదారులకు సవివరంగా తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 341 వినతులు వచ్చాయి.
ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కళావతి, శ్రీధర్ రెడ్డి, లక్ష్మీజ్యోతి, మాధురి, జాన్సన్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
