బల్కం పేట ఫిబ్రవరి 27
(జే ఎస్ డి ఎం న్యూస్) :
రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శుక్రవారం బల్కంపేట ఎల్లమ్మ ,పోచమ్మ ఆలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమతో కలిసి ఆలయ పరిపాలన విభాగాన్ని పరిశీలించారు.లడ్డూ ప్రసాద కౌంటర్, ప్రధాన బుకింగ్ కౌంటర్, రికార్డ్స్ రూమ్, ఈఓ, సూపరింటెండెంట్ కార్యాలయాలు, నిర్మాణంలో ఉన్న పార్కింగ్ కాంప్లెక్స్, భక్తుల క్యూ లైన్లను పరిశీలించారు. ఆలయ అధికారులు, సిబ్బంది పనితీరుపై భారీగా ఫిర్యాదులు రావడంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు.లడ్డూ, పులిహోర తయారీ విధానం, శుభ్రతపై ఆరా తీసి శాంపిళ్లను పరీక్షలకు పంపించారు.
200 గ్రాములు ఉండాల్సిన పులిహోర ప్యాకెట్ 150 గ్రాములే ఉండటాన్ని గుర్తించారు. ప్రసాదం తయారీ గది పరిశుభ్రత లోపించినట్లు గమనించి వెంటనే
శుభ్రపరచాలని ఆదేశించారు.విధుల్లో
నిర్లక్ష్యం వహించిన స్వీపర్ (ఔట్‌సోర్సింగ్)జి.రాము,అటెండర్,(రెగ్యులర్)ఎస్.శ్రీహరి,స్వీపర్ (ఔట్ సోర్సింగ్)పి.నరసింహ,సీనియర్ అకౌంటెంట్(ఔట్ సోర్సింగ్ ) జీ.ప్రభాకర్ రావును విధుల నుంచి తొలగించాలని నిర్ణయించారు.అర్చకుడు ఏ.శ్రీనివాసాచార్యులపై ఛార్జ్ షీట్ మెమో జారీ చేయాలని ఆదేశించారు ముగ్గురు ఉద్యోగులు, ఒక పూజారిని తొలగించినట్లు తెలిపారు. దేవస్థాన అధికారులు నిర్లక్ష్యంగా ఉండటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారం, వెండి, నగలు, దాతల వివరాలు, టెండర్లు, హుండీ లెక్కలపై రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని దేవాదాయ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. అవకతవకలు తేలితే కఠిన చర్యలుతీసుకుంటామని
హెచ్చరించారు.భక్తులకు మెరుగైన పార్కింగ్ సదుపాయాలు కల్పించడం, శాశ్వత ఈవో నియామకం, కాంట్రాక్టు ఉద్యోగులకు ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయాలుకల్పించనున్నట్లు తెలిపారు. తెలంగాణ దేవాలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు.

