హైదరాబాద్, మార్చి 02,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ద్విచక్ర వాహనం నడిపే వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, వెనుక కూర్చున్న పీలియన్ రైడర్స్ కూడా హెల్మెట్ ధరించాలని గోల్కొండ జోన్ ట్రాఫిక్ అదనపు డిసిపి సి. వేణుగోపాల్ రెడ్డి అన్నారు. కుల్సుంపుర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నానల్ నగర్ వద్ద వాహనదారుల భద్రతే ధ్యేయంగా ట్రాఫిక్ నిబంధనలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ట్రాఫిక్ గోల్కొండ జోన్ అదనపు డీసీపీ సి. వేణుగోపాల్ రెడి, ట్రాఫిక్ గోల్కొండ జోన్ ఏసీపీ డి. ధనలక్ష్మి హాజరయ్యారు.
ఈ సందర్భంగా అధికారులు వాహనదారులకు పలు కీలక సూచనలు చేశారు.ద్విచక్ర వాహనం నడిపే వారితో పాటు వెనుక కూర్చునే వారు
కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. 4 సంవత్సరాల పైబడిన పిల్లలకు కూడా హెల్మెట్ ధరింపజేయడం చట్టరీత్యా అవసరమని స్పష్టం చేశారు.కారు నడిపే డ్రైవర్‌తో పాటు ప్రయాణికులు అందరూ సీట్ బెల్ట్ ధరించడం వల్ల ప్రమాదాల తీవ్రతను తగ్గించవచ్చన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలను ఎడమ వైపు నుండి ఓవర్‌టేక్ చేయకూడదు. కుడి వైపున మాత్రమే ఓవర్ టేక్ చెయ్యాలి భారీ వాహనాలు ఎల్లప్పుడూ రోడ్డుకు ఎడమ వైపున మాత్రమేప్రయాణించాలి.పరిమితి మించి వేగం
వెళ్ళకూడదు అన్నారు.
రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు, హెచ్ సి ఎస్ సి టీమ్, యంగ్ ఇండియా టీమ్ సహకారంతో అర్హులైన వాహనదారులకు 15 హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో టోలిచౌకి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ జి. వెంకటేశ్వర్లు, ఖుల్సుంపురా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఎం. రాజేంద్ర ప్రసాద్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షిత ప్రయాణాన్ని సాగించాలని అధికారులు కోరారు.

