మంత్రి గొట్టిపాటి ఆధ్వర్యంలో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ -ఏప్రిల్ 16లోపు విద్యార్థులందరికీ ఉచిత సైకిళ్లు అందజేత -భగీరథ కెమికల్స్ సహకారంతో పాఠశాలల్లో రక్షిత తాగునీటి ప్లాంట్లు -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్

అద్దంకి నియోజకవర్గంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతోంది. మంగళవారం కొరిశపాడు మండలంలోని పమిడిపాడు, దైవాలరావూరు ఉన్నత పాఠశాలలకు చెందిన 271 మంది విద్యార్థులకు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా పమిడిపాడు ఉన్నత పాఠశాలలో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రహరీ గోడకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే భగీరథ కెమికల్స్ సహకారంతో పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్వో తాగునీటి ప్లాంట్‌ను రిబ్బను కట్ చేసి ప్రారంభించారు. అదే గ్రామంలో 16 మంది చిరువ్యాపారులకు తోపుడు బళ్లను పంపిణీ చేశారు. పమిడిపాడులో సుమారు రూ.3 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

విద్యార్థులకు సైకిళ్లు అందజేస్తూ మంత్రి మాట్లాడుతూ…దాతల సహకారంతో అందిస్తున్న ఈ సైకిళ్లు విద్యార్థుల విద్యాభ్యాసానికి ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులు సైకిళ్లపై సంతోషం వ్యక్తం చేయగా, ఏప్రిల్ 16 నాటికి నియోజకవర్గంలోని అన్ని అర్హులైన విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ పూర్తి చేస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. అందుకే “తల్లికి వందనం” పథకం ద్వారా అర్హులైన ప్రతి విద్యార్థికి రూ.15,000 అందిస్తున్నామని తెలిపారు. యూనిఫాం, పుస్తకాలు, షూస్ కూడా అందజేస్తున్నామని చెప్పారు. తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి..

పదో తరగతి విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు. గతంలో పది మంది ఉపాధ్యాయులు ఉండాల్సిన చోట మూడు లేదా నాలుగు మంది మాత్రమే ఉండే పరిస్థితి ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెగా డీఎస్సీ ద్వారా 16,300కు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేశామని చెప్పారు. తల్లిదండ్రులు కష్టపడి పిల్లలను చదివిస్తున్నారని, విద్యార్థులు ఆ విషయం గుర్తుంచుకొని శ్రద్ధగా చదవాలని సూచించారు. పదో తరగతి విద్యార్థుల కోసం సాయంత్రం ప్రత్యేక ట్యూషన్ తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో విద్యా వ్యవస్థ దెబ్బతిన్నదని మంత్రి విమర్శించారు. నాడు–నేడు పేరుతో అప్పటి నాయకులు ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు సమానంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. అద్దంకి నియోజకవర్గంలోని ఎనిమిది ఉన్నత పాఠశాలల్లో భగీరథ ఇండస్ట్రీస్ సహకారంతో రక్షిత తాగునీటి ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *