పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాధికారి శ
సి.వి.రేణుక
తెలిపారు. విద్యాశాఖ అదనపు సంచాలకులు, జిల్లా పరిశీలకులు ఏ.సుబ్బారెడ్డి, పరీక్షల నిర్వహణ విభాగ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావులతో కలిసి శనివారం ఒంగోలు సంతపేటలోని డి.ఆర్.ఆర్.ఎం. ఉన్నత పాఠశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వీటికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఈనెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు రెగ్యులర్ విభాగ పరీక్షలు, 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. రెగ్యులర్ పబ్లిక్ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు, ఓపెన్ స్కూల్ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటాయని తెలిపారు. ఇవి విద్యాపరమైన పరీక్షలు కాబట్టి 30 నిమిషాలు ఆలస్యమైనా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తామన్నారు. ఉమ్మడి జిల్లాలో పరీక్ష కేంద్రాల్లో విద్యుత్, త్రాగునీరు, వైద్య శిబిరాలు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి మౌలిక వసతులు కల్పించామన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం తగిన రవాణా సౌకర్యం కల్పించామని, ఆర్టీసీ బస్సులలో వెళ్లే విద్యార్థులు హాల్ టికెట్ చూపిస్తే ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం ఉందన్నారు. హాల్ టికెట్ పై ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా పరీక్ష కేంద్రాన్ని గుర్తించవచ్చు అన్నారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలో జిరాక్స్ సెంటర్ లను మూసివేయిస్తామని, పోలీసుల ద్వారా అవసరమైన బందోబస్తు కల్పించేలా చర్యలు తీసుకున్నామన్నారు.
*పరీక్షల నిర్వహణ ఇలా…*
*. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెగ్యులర్ పబ్లిక్ పరీక్షలకు మొత్తం 28,632 మంది విద్యార్థులు హాజరవుతారు. వీరిలో రెగ్యులర్ విభాగంలో 14,289 మంది బాలురు, 14,312 మంది బాలికలు ఉన్నారు. ప్రైవేట్ విభాగంలో 21 మంది బాలురు, పదిమంది బాలికలు ఉన్నారు.
*. ఓపెన్ స్కూల్ సొసైటీ నుంచి రెగ్యులర్ మరియు ఒకసారి ఫెయిల్ అయిన వారు 1144 మంది ఉన్నారు. వీరిలో 823 మంది బాలురు, 321 మంది బాలికలు పరీక్షలు రాస్తారు.
*. ఎస్.ఎస్.సి. పబ్లిక్ పరీక్షల కోసం 165 సెంటర్లను, ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షల కోసం 14 సెంటర్లను ప్రభుత్వం కేటాయించింది.
*. పబ్లిక్ పరీక్షలు ముగిశాక ఒంగోలులోని డిఆర్ఆర్ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఏప్రిల్ నాలుగవ తేదీ నుంచి 13వ తేదీ వరకు స్పాట్ వాల్యుయేషన్ ఉంటుందని వివరించారు.
