గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న సుమారు 300 మంది ఔట్సోర్సింగ్ నర్సింగ్ సిబ్బందికి గత జనవరి నుంచి జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ శోభ కు వినతిపత్రం సమర్పించారు.
దాదాపు 20 సంవత్సరాలుగా ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న నర్సులు ప్రతినెల జీతాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వాలు మారినా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల విషయంలో నిర్లక్ష్యం కొనసాగుతోందని విమర్శించారు.
కొత్త కాంట్రాక్టర్లు బాధ్యతలు స్వీకరించి మూడు నెలలు కావస్తున్నా, అటెండెన్స్ పంపడం, ఒప్పందాలు పూర్తి చేయకపోవడం వల్ల జీతాల చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని పేర్కొన్నారు. తక్కువ జీతాలతో పనిచేస్తున్న సిబ్బందికి సమయానికి జీతాలు రాక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి నేరుగా జీతాలు చెల్లిస్తే ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని సూచించారు. ఉగాది పండుగను దృష్టిలో ఉంచుకుని రెండు రోజుల్లో జీతాలు చెల్లించాలని, లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నర్సింగ్ సిబ్బంది సుందరమ్మ, నాగమణి, శాంతి, ఉపేంద్ర, అనిలా, సరిత, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

