శ్రీహర్షిణి డిగ్రీ అండ్ పీజీ కళాశాల వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా ముగిసాయి. ఈ వార్షికోత్సవ వేడుకలకు ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి , సంతనూతలపాడు ఎమ్మెల్యే బి. ఎన్ విజయకుమార్ , బాపట్ల పార్లమెంట్ తెలుగుదేశం ఉపాధ్యక్షులు సుబ్బారావు , మద్దిపాడు మండల తెలుగుదేశం నాయకులు ఉప్పుగుండూరు నాగేశ్వరరావు , తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత 32 సంవత్సరాలుగా ఒక విద్యాసంస్థను నిర్వహించడం అంటే సామాన్యమైన విషయం కాదని, ప్రతి సంవత్సరం ప్రగతిని సాధిస్తూ అంచలంచెలుగా విద్యావ్యవస్థలో ఉన్నత స్థానానికి ఎదిగిన శ్రీహర్షిణి రవికుమార్ కి అభినందనలు తెలియజేశారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాట్లాడుతూ గత 32 సంవత్సరాలుగా విద్యార్థులను తీర్చిదిద్దుతూ ఎంతోమందిని ఉన్నత స్థాయికి చేరుకొనుటలో కృషిచేసిన రవికుమార్ కి మరియు ఇతర అధ్యాపక బృందానికి అందరికీ అభినందనలు తెలిపారు. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన రవికుమార్ ఈరోజు 10వేల మంది విద్యార్థులతో విద్యాసంస్థలను నిర్వహిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలబడ్డార ని అన్నారు. తదుపరి గత సెమిస్టర్ పరీక్షలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు .ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కళాశాల చైర్మన్ గోరంట్ల రవికుమార్ మాట్లాడుతూ కళాశాల స్థాపించిన నాటి నుండి విద్యార్థినీ విద్యార్థులకు చదువుతోపాటు విలువలను కూడా తెలియజేస్తూ విద్యార్థిని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు వెళ్లే విధంగా తీర్చిదిద్దటమే ధ్యేయంగా సంస్థ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఇంటర్మీడియట్లో ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయి ర్యాంకులు మరియు జె. ఈ. ఈ , ఐఐటి, నీట్ లలో ఉత్తమ ర్యాంకులు సాధించడం జరుగుతుందని , డిగ్రీలో అయితే కేవలం డిగ్రీ కాకుండా డిగ్రీ పూర్తయిన విద్యార్థిని విద్యార్థులకు డిగ్రీతోపాటు జాబ్ ఆఫర్ లెటర్ ను కూడా ఇస్తున్న ఏకైక విద్యాసంస్థ శ్రీహర్షిణి అని చెప్పారు. ఇదే స్పూర్తితో నూరు శాతం ప్లేస్మెంట్స్ లక్ష్యంగా విద్యార్థినిలకు ఈ సంవత్సరం నూతనంగా శ్రీహర్షిణి మహిళా ఇంజనీరింగ్ కళాశాలను ప్రారంభించి దిగ్విజయంగా నిర్వహిస్తున్నాము అని తెలియజేశారు. గత 32 సంవత్సరాలుగా మా ఎదుగుదలలో భాగమైన మా పూర్వ విద్యార్థినీ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మరి ముఖ్యంగా మా అధ్యాపక బృందానికి అందరికీ కృతజ్ఞతలు అని తెలియజేశారు. ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి విద్యార్థినిలతో నృత్యం చేసి విద్యార్థినీ విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపారు.





