శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని, శ్రీ సీతారామచంద్ర స్వామి భక్త జన సేవా సమితి ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో వేంచేసియున్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో నిర్వహించిన శ్రీ సీతారాముల స్వామి వారి పూజా కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు పాల్గొన్నారు. అనంతరం ఎస్పీ నూతన పంచాంగాన్ని ఆవిష్కరించి, పంచాంగాలను భక్తులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పోలీస్ సిబ్బందికి మరియు జిల్లా ప్రజలకు శ్రీ పరాభవ నామ సంవత్సర (ఉగాది) శుభాకాంక్షలు తెలిపారు. పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకోవాలని సూచించారు. ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. అదేవిధంగా, పోలీస్ అధికారులు, సిబ్బంది మంచి మనస్సుతో విధులను సమర్థంగా నిర్వర్తించి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.
ఉగాది పర్వదినం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ప్రముఖ దేవాలయాలు, తిరునాళ్లు జరిగే ప్రదేశాల్లో అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజల వాహనాల రద్దీ కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకొని, ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దేవాలయ ప్రాంగణాల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేసి, క్యూ లైన్ల వద్ద భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన సిబ్బందిని నియమించినట్లు తెలిపారు.
ఒంగోలులోని జిల్లా పోలీస్ క్వార్టర్స్ లో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్ధానము నందు 19 నుండి 28 వరకు వసంత నవరాత్రోత్సవములు జరుగును.
ఈ కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జగదీష్, ఆర్ఐలు సీతారామి రెడ్డి, రమణారెడ్డి, ఎఆర్ఎస్సైలు, ఆలయ ప్రధాన అర్చకులు యం.రమణ దీక్షితులు, యం.దక్షణా మూర్తి, సీతారామచంద్ర స్వామి భక్త జన సేవా సమితి సభ్యులు మరియు భక్తులు పాల్గొనారు.


