మున్సిపాలిటీల పరిధిలో పారిశుద్ధ్యంపైమరింత దృష్టి సారించాలి – జిల్లా కలెక్టర్ మరియు ఒంగోలు మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ పి.రాజాబాబు

మున్సిపాలిటీల పరిధిలో పారిశుద్ధ్యంపై
మరింత దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ మరియు ఒంగోలు మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ పి.రాజాబాబు
ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణలోకి
వెళ్లిన నేపథ్యంలో ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ శుక్రవారం వీరితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వివిధ పథకాలకు సంబంధించి ఆయా మున్సిపాలిటీలలో పురోగతిపై ఆయన సమీక్షించారు.
అనంతరం మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులతో కలెక్టర్ ప్రత్యేకంగా చర్చించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఘననీయమైన పురోగతి కనిపించాలని స్పష్టం చేశారు. దీనిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించి, దానికి ఒక డ్రోన్ కూడా కేటాయించాలన్నారు. ఒంగోలు మున్సిపాలిటీ పరిధిలోని స్మశాన వాటికలలో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని కలెక్టర్ చెప్పారు. నిరాశ్రయులు రాత్రివేళ ఆశ్రయం పొందేందుకు నూతన నైట్ షెల్టర్ నిర్మించేందుకు తగిన ప్రతిపాదనలు రూపొందించాలని స్పష్టం చేశారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున పూర్తిస్థాయిలో ఆస్తి పన్ను వసూలు చేయడంపై దృష్టి సారించాలన్నారు. ఈ విషయంలో ప్రతిరోజూ తనకు వివరాలు తెలియజేయాలని కలెక్టర్ ఆదేశించారు. ద్విచక్ర వాహనాలకు పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు నగరంలో రహదారుల వెంట ఏర్పాటు చేస్తున్న గ్రీన్ బెల్ట్ వద్ద పార్కింగ్ సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. నగరంలో కొత్తగా 15 టాయిలెట్స్ నిర్మించేందుకు వారం రోజుల్లోగా స్థలాలను గుర్తించి, అవసరమైన ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. మున్సిపాలిటీ ద్వారా అందుతున్న సేవలు, కల్పిస్తున్న సదుపాయాలపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం మరింత పెరగటమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన దిశా నిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో మున్సిపల్ ఇంజనీర్ ఐసయ్య, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వైష్ణవి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ బాబూరావు, రెవిన్యూ ఆఫీసర్ విజయభాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *