అంతర్జాతీయ కవితా దినోత్సవం సందర్భంగా
ప్రకాశం జిల్లా కమిటీ జనసాహితి ఆధ్వర్యంలో శనివారం ఒంగోలు ఎన్జీవో హోంలో సామ్రాజ్యవాద యుద్ధంపై కవితాస్త్రాలు సంధించారు కవులు.
తమ ఆయిల్ దాహం కోసం, ఆయుధ వ్యాపారుల లాభాల కోసం ప్రపంచ ప్రజానీకం పై యుద్ధాలను రుద్దుతున్న అమెరికన్ సామ్రాజ్యవాదులకు నిరసన తెలియజేస్తూ, యుద్ధం వల్ల కుటుంబాలను కోల్పోతున్న ప్రజలకు సంఘీభావంగా, ధరల పెరుగుదల వల్ల కృంగిపోతున్న ప్రజలకు అండగా, యుద్ధం పట్ల మన పాలకుల మౌనం పట్ల నిరసనగా జరిగిన ఈ సభలో సామ్రాజ్యవాదంపై ఎక్కుపెట్టిన తమ కవితలను పదుల సంఖ్యలో ఒంగోలు కవులు వినిపించారు.
అనంతరం అఖిల భారత ప్రజా సాహిత్య సాంస్కృతిక వేదిక ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కొత్తపల్లి రవిబాబు అనువదించిన కవితల సంకలనం కలమే నా ఆయుధం పుస్తకాన్ని ప్రముఖ కవి, జర్నలిస్టు సాబిర్ హుస్సేన్ ఈ సభలో పరిచయం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో అనేక దేశాల స్థితిని కళ్ళకు కట్టినట్లు చూపించే కవిత్వాన్ని అనువదించినందుకు కొత్తపల్లి రవిబాబు కి ధన్యవాదాలు తెలిపారు. ఎప్పుడో రాసిన కవితలు ఈ నాటికీ ప్రాసంగికత కలిగి ఉండటం అరుదైన విషయమని, ప్రతి ఒక్కరూ చదవాల్సిన కవిత్వమని తెలియజేశారు.
జనసాహితి జిల్లా అధ్యక్షులు డాక్టర్ జి.వి.కృష్ణయ్య సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ సభలో నూకతోటి రవి కుమార్, జ్యోతివాసు, దుగ్గినపల్లి ఎజ్రా శాస్త్రి, కోటేశ్వరమ్మ, జాలాది మోహన్, జన సాహితి నాయకులు ప్రసన్న, విజయభాస్కర్ రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, ఏసుదాసు, తదితరులు తాము వ్రాసిన/ తమకు నచ్చిన యుద్ధ వ్యతిరేక కవితలను చదివి వినిపించారు. జన సాహితి నాయకులు డి.వి., ఖాదర్ భాషా, యోహాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

