ఒంగోలు నగర ముఖ చిత్రాన్ని మార్చేలా అవసరమైన ప్రణాళికలు రూపొందించాలి – జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు

ఒంగోలు నగర ముఖ చిత్రాన్ని మార్చేలా అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు
చెప్పారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించి, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు, ఆంధ్ర ప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ప్రతినిధులకు దిశా నిర్దేశం చేశారు. రామాయపట్నం పోర్టు, బీపీసీఎల్, ఇండో సోల్, జిందాల్ కంపెనీల పెట్టుబడులు, మైనింగ్ కార్యకలాపాలు, పర్యాటక అభివృద్ధి ఊపొందుకుంటున్న నేపథ్యంలో జిల్లా కేంద్రమైన ఒంగోలును ఆతిథ్యపరంగా, ఆహ్లాదకరంగా భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా అభివృద్ధి చేయబోతున్నట్లు కలెక్టర్ ఈ సందర్భంగా చెప్పారు. రిక్రియేషన్ సెంటర్, సెంట్రల్ పార్కు ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పటికే ఉన్న ట్రంకు రోడ్డును విస్తరించి, పార్కింగ్ సదుపాయాలను విస్తృతం చేసి, రద్దీ ప్రాంతాలలో అధునాతన టాయిలెట్లు నిర్మించి, డిజిటల్ డిస్ప్లే లతో నగరానికి మరింత శోభ తీసుకురావడంపై దృష్టి పెట్టామన్నారు. నగరంలోనికి ప్రవేశ, వీడ్కోలు జంక్షన్లు మరింత ప్రత్యేకతతో కూడినవిగా తీర్చిదిద్దబోతున్నామన్నారు. నగరానికి వెలుపల శాటిలైట్ టౌన్ షిప్ కూడా ఏర్పాటు చేసేలా ఆలోచిస్తున్నట్లు తెలిపారు. తక్కువ నిర్వహణ ఖర్చుతో నగరానికి మరింత వన్నె తెచ్చేలా ఆయా సౌకర్యాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ చెప్పారు. అవసరమైతే భూ సమీకరణ విధానములో ముందుకు వెళ్తామన్నారు. ట్రంక్ రోడ్డులో చేపట్టే అభివృద్ధి కార్యకలాపాల ప్రణాళికను 15 రోజుల్లోగా, మొత్తం నగరానికి అవసరమైన సమగ్ర ప్రణాళికను నెల రోజుల్లోగా రూపొందించాలని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఇంజనీర్ ఐసయ్య, ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ తరపున చిలకమర్రి శ్రీకమల్, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *