షేరింగ్, కేరింగ్ లక్షణాలను ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి – జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు

షేరింగ్, కేరింగ్ లక్షణాలను ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు
పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పబ్లిక్, ప్రైవేట్ పీపుల్స్ పార్టనర్ షిప్ ( పీ – 4 ) కార్యక్రమ మొదటి వార్షికోత్సవం సందర్భంగా పేదలకు సహాయం చేయడంలో ఉత్తమ మార్గదర్శకులుగా ఎంపిక అయిన వారిని సోమవారం ప్రకాశం భవనంలో ఘనంగా సత్కరించారు.
               ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధి పరంగా సమాజంలో టాప్ -10 స్థానంలో ఉన్నవారు, పేదరికంతో అట్టడుగున ఉన్న 20 శాతం మందికి వెన్నుదన్నుగా నిలిచేలా ముఖ్యమంత్రి శ్రీ.నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని గత ఏడాది ప్రారంభించినట్లు చెప్పారు. సమాజం అందించిన సహకారంతో ఉన్నత స్థానానికి ఎదిగిన వారు తిరిగి సమాజానికి సహాయం చేసేలా ముందుకు రావాలని కలెక్టర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఆంధ్ర యూనివర్సిటీలో తాను చదువుకుంటున్నప్పుడు అధ్యాపకులు తనకు మార్గనిర్దేశం చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు. అదే స్ఫూర్తితో తాను కూడా ఒక ట్రస్టును నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమాజ హితం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతతో ముందుకు రావాలని కలెక్టర్ కోరారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాలలో ఇప్పటివరకు 79099 బంగారు కుటుంబాలను గుర్తించామన్నారు. మార్గదర్శకులుగా
3836 మంది ముందుకు వచ్చి 26594 కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు తెలిపారు. మిగిలిన బంగారు కుటుంబాలకు మార్గదర్శకులుగా ముందుకు రావాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
               జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి మాట్లాడుతూ ఆర్థిక సహాయం చేస్తేనే మార్గదర్శకులు అవుతారనుకోవద్దని, అభివృద్ధి దిశగా సాగేలా పేదలకు అవసరమైన దిశానిర్దేశం చేస్తూ కూడా మార్గదర్శకులుగా నిలవొచ్చని చెప్పారు. ముఖ్యమంత్రి ఆశయ సాధనకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వహించాలని ఆమె పిలుపునిచ్చారు.
                 ముఖ్యమంత్రి పిలుపుతో తాము అందిస్తున్న సేవలను డీజేఆర్ ట్రస్ట్ ప్రతినిధి డాక్టర్ హిమబిందు, అసిస్ట్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి విష్ణు ప్రియ ఈ సందర్భంగా వివరించారు. కాగా, తమకు అందుతున్న సహాయాన్ని పలువురు విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో తెలియజేశారు.
             జిల్లాస్థాయిలో ఉత్తమ మార్గదర్శకులుగా ఎంపిక చేయబడిన అసిస్ట్ ఎన్జీవో ( అద్దంకి ), డీజే ఆర్ ట్రస్ట్ ( ఒంగోలు ), తిరుపతి స్వామి స్వర్ణ ( సంతనూతలపాడు ), డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ( దర్శి )ల తరపున వారి ప్రతినిధులు ఈ సందర్భంగా ప్రశంస పత్రాలు అందుకున్నారు.
               ఈ కార్యక్రమంలో డీఆర్వో బి.చిన ఓబులేసు, సిపిఓ సుధాకర్ రెడ్డి, జడ్పీ సీఈవో చిరంజీవి, డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు, డిపిఓ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మార్గదర్శకులుగా ఉండి వ్యక్తిగతంగా తాము చేస్తున్న సహాయాన్ని కూడా వారు వివరించారు.
             తిరుపతిలో జరిగిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగ ప్రత్యక్ష ప్రసారాన్ని ఈ సందర్భంగా వీరు వీక్షించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *