నూతనంగా ఏర్పడిన అద్దంకి రెవెన్యూ డివిజన్ కూడా అభివృద్ధిపరంగా వేగంగా ముందుకు పయనించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఈ విషయంపై మరింత దృష్టి సారించి సమన్వయంతో పని చేయాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. డివిజన్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రణాళికలు, రెవిన్యూ అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం అద్దంకి ఆర్డిఓ కార్యాలయంలో కలెక్టర్ ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.
*నిర్లక్ష్యాన్ని సహించను*
ఉపాధి హామీ, పంచాయతీరాజ్ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్షించారు. మండల స్థాయి అధికారులు స్థానికంగా నివాసం ఉంటూ, ప్రతిరోజూ ఉదయం పారిశుద్ధ్యం, ఉపాధి హామీ పనులను పరిశీలించాలని ఆయన ఆదేశించారు. తాగునీటి సరఫరా, శానిటేషన్ నిర్వహిస్తున్న తీరును రోజుకు ఒక గ్రామం చొప్పున పరిశీలించాలని స్పష్టం చేశారు. తాగునీటి ట్యాంకులను శుభ్రపరచడం, చేతిపంపులకు, కుళాయిలకు అవసరమైన మరమ్మతులు చేపట్టడం, భూగర్భ నీటిమట్టం పెంచడం వంటి పనులలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని హెచ్చరించారు. ఆయా విషయాలలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఐ.వి.ఆర్.ఎస్. సర్వేలో ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెరిగేలా అధికారుల పనితీరు ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఉపాధి హామీ పనులు చేపట్టేందుకు వచ్చే మూడు నెలల కాలాన్ని సమర్ధంగా వినియోగించుకోవాలని చెప్పారు.
*ప్రత్యేక ప్రణాళిక అవసరం*
ఎరువులు, రసాయనాల వినియోగాన్ని తగ్గించి పంట దిగుబడులు పెరిగేలా వ్యవసాయ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. దీనికోసం వచ్చే మూడు నెలల కాలానికి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలన్నారు. ‘ రైతన్నా మీకోసం ‘ కార్యక్రమంలో సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు అవగాహన కల్పించడం, పంటల మార్పిడి దిశగా వారిని ప్రోత్సహించటం వంటి అంశాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ చెప్పారు. వారానికి మూడు రోజులపాటు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆయన స్పష్టం చేశారు. మండలాల వారీగా నెలకొన్న పరిస్థితులను ఆయన అడిగి తెలుసుకున్నారు.
*ప్రజల్లో సంతృప్తి పెరగాలి*
ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరిగేలా రెవెన్యూ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. వెబ్ ల్యాండ్, మ్యుటేషన్, 22(ఏ), ‘ ఇతరములు ‘ వంటి రెవెన్యూ సమస్యలపై మరింత దృష్టి సారించాలని చెప్పారు. రెవిన్యూ క్లినిక్ , ‘ మీకోసం ‘ కార్యక్రమాల్లో వస్తున్న అర్జీలను పునరావృతం కాకుండా సహేతుకంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. మరిన్ని సమస్యలు తలెత్తకుండా ఎండార్స్ మెంట్ స్పష్టంగా ఉండాలన్నారు. ఈ డివిజన్ లోని 22(ఏ) భూముల సమస్యను సత్వరం పరిష్కరించేలా క్షేత్రస్థాయిలో తాను విస్తృతంగా పర్యటిస్తానని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశాలలో సిపిఓ సుధాకర్ రెడ్డి, డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు, జెడ్పి సీఈవో చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వరరావు, డ్వామా పీ.డీ. జోసఫ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు,
ఆర్టీవో జాన్సన్, గ్రామ, వార్డు సచివాలయాల నోడల్ ఆఫీసర్ సువార్తమ్మ, ఏడీఏలు, ఎంపీడీవోలు, తహసిల్దారులు, ఎంఏవోలు, ఏపీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.



