న్యూఢిల్లీ, 1 ఏప్రిల్,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మంగళవారం ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో ఉన్న ప్రైవేటు సంస్థ LOHUM R&D కేంద్రాన్ని, అలాగే లిథియం, కోబాల్ట్ రిఫైనరీలను సందర్శించారు. ఈ సందర్భంగా, సుస్థిరమైన, పర్యావరణహిత విధానాల ద్వారా కీలక ఖనిజాల భద్రతను సాధించేందుకు భారత ప్రభుత్వం మిషన్ మోడ్ లో పనిచేస్తున్న తీరును కేంద్రమంత్రి వివరించారు. ఈ దిశగా క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ కేంద్రాలు ప్రత్యేక కార్యాచరణతోపనిచేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.
ఈ సందర్శన సందర్భంగా కిషన్ రెడ్డి అక్కడి సైంటిస్టులు, ఇంజినీర్లు, R&D సిబ్బందితో మాట్లాడి, ఉపయోగించిన బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుండి లిథియం, కోబాల్ట్‌ను రీసైక్లింగ్, రీపర్పసింగ్ చేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక సిబ్బంది ఈ సందర్భంగా ఆధునిక రీసైక్లింగ్ సాంకేతికతలు, వాటి సామర్థ్యం, పర్యావరణ ప్రయోజనాలను కేంద్రమంత్రికి సవివరంగా తెలియజేశారు.
రీసైక్లింగ్ ప్రక్రియ ద్వారా లిథియం ఉత్పత్తి చేస్తున్న అతిపెద్ద సంస్థ అయిన LOHUM సంస్థ ద్వారా జరుగుతున్న ప్రయత్నాలకు కేంద్రమంత్రి ప్రశంసించారు.
ఈ రీసైక్లింగ్ ద్వారా క్రిటికల్ మినరల్స్ కోసందిగుమతులపై ఆధార పడటం
తగ్గడంతోపాటుగా డొమెస్టిక్ సప్లయ్ చైన్స్ బలోపేతం అవుతుందని వెల్లడించారు.
ముఖ్యంగా అంతర్జాతీయంగా నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా క్రిటికల్ మినరల్స్ కోసం పోటీ పెరిగిందన్నారు. అందుకే భారతదేశంలో క్రిటికల్ మినరల్స్ నిల్వలు తక్కువగా ఉన్నందున. రీసైక్లింగ్‌పై ప్రత్యేక దృష్టిసారించాలనిప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించిన విషయాన్ని కేంద్రమంత్రి పునరుద్ఘాటించారు.
క్రిటికల్ మినరల్స్ వ్యూహాత్మక ప్రాధాన్యతను భారత ప్రభుత్వం గుర్తించి, వాటి లభ్యతను నిర్ధారించేందుకు నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ (NCMM) ను ప్రారంభించిన విషయాన్ని కేంద్రమంత్రి గుర్తుచేశారు. NCMM లో భాగంగా.. విదేశాల్లో ఖనిజ వనరుల కోసం ఆయా దేశాలతో ఒప్పందాలు చేసుకోవడం, దేశీయంగా ఎక్స్‌ప్లొరేషన్ కు ప్రోత్సాహాన్ని అందించడం, రీసెర్చ్&డెవలప్‌మెంట్ ప్రాజెక్టులకు మద్దతు, రీసైక్లింగ్ వంటి అంశాలను ప్రభుత్వం ప్రాధాన్యతగాతీసుకుంటోందని తెలిపారు. రూ.32,000 కోట్ల వ్యయంతో మిషన్ మోడ్‌లో ప్రారంభించిన “National Critical Mineral Mission ద్వారా ఎక్స్‌ప్లొరేషన్, మైనింగ్, ప్రాసెసింగ్, రీసైక్లింగ్ రంగాలలో సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేస్తామన్నారు.
‘Urban Mining’
ప్రాముఖ్యతను కూడా
ఈ సందర్భంగా కేంద్రమంత్రి వివరించారు. ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్, అటోమొబైల్ వ్యర్థాలలో లిథియం, కోబాల్ట్, నికెల్ తోపాటుగా వివిధ అరుదైన మూలకాలు ఉన్నాయని, వాటిని సక్రమంగా సేకరించి ప్రాసెస్ చేస్తే వనరులను సద్వినియోగంచేసుకోవచ్చన్నారు. ఈ వ్యర్థాలు భూమిలో కలిసిపోవడం వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కూడా బాటలు వేయొచ్చన్నారు.క్రిటికల్ మినరల్స్ రీసైక్లింగ్‌ను భారత్ వేగంగా విస్తరించేందుకు ఇదే సరైనసమయమని,సుస్థిరాభివృద్ధి, పర్యావరణహిత విధానాలు.. దేశ భద్రత,
ఆర్థిక స్థిరత్వానికి అత్యంత అవసరమని కేంద్రమంత్రి పేర్కొన్నారు.LOHUM సంస్థ సర్క్యులర్ ఎకానమీకి చేస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు. వ్యర్థాలను విలువైన వనరులుగా మార్చే ఈ విధానం దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడమే కాకుండా పెద్దఎత్తున మన దేశంలో ఉపాధి అవకాశాలను సృష్టించడం, సాంకేతిక అభివృద్ధిని ప్రోత్సహించడం, దేశ పర్యావరణ లక్ష్యాలకు అనుగుణంగాముందుకెళ్లడాన్ని కేంద్రమంత్రి
అభినందించారు.
క్రిటికల్ మినరల్ రంగంలో పనిచేస్తున్న పరిశ్రమలు, స్టార్టప్‌లు, పరిశోధనా సంస్థలకు ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం ఇస్తోందన్నారు. విధానపరమైన మద్దతు, ఇన్సెంటివ్స్ తోపాటుగా అనుంబంధ వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఆలోచనలకు, ఇండస్ట్రీ, రీసైక్లింగ్, ప్రాసెసింగ్ సంస్థలు.. సంపూర్ణ సహకారం అందిస్తే క్రిటికల్ మినరల్ రంగంలో భారతదేశం ఆత్మనిర్భరత సాధించడం ఖాయమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.





