జలమే జీవనాధారమని, అది దైవంతో సమానమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి చెప్పారు. నీటి వనరులను కాపాడుకుంటూ భూగర్భ నీటి మట్టాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ జల ధార – జల హారతి ‘ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబుతో కలిసి సోమవారం వల్లూరు చెరువు వద్ద ఆయన ప్రారంభించారు. ముందుగా వల్లూరమ్మ ఆలయంలో వారు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు
చెరువులో గంగమ్మకు ప్రత్యేక హారతి ఇచ్చి చీర, సారెలను వదిలారు. చెరువులో పూడికతీత, మరమ్మతులకు ఏర్పాటుచేసిన పొక్లైన్ ను ప్రారంభించారు. చెరువు కట్టపై మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మరమ్మతులు చేయాల్సిన నీటి వనలను గుర్తించడం, వాటిని చేపట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం, వంద రోజుల్లో మొత్తం పనులు పూర్తి చేయటం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది అన్నారు. నీటి వనరులను పునరుద్ధరించటం, జల సంరక్షణ పనుల ద్వారా భూగర్భ నీటిమట్టాలను పెంచడం లక్ష్యంగా ఈ ప్రణాళిక ఉంటుందన్నారు. ఒక రైతు బిడ్డగా నీటి విలువను గుర్తించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా తన పరిపాలనలో నీటి భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. 2014 – 19 కాలంలో కూడా సింగరాయకొండలో ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టినట్లు గుర్తు చేశారు. నీటిమట్టం పెరగటం వలన విద్యుత్ వినియోగం తగ్గి, రైతులపై ఆర్థిక భారం కూడా తగ్గుతుందన్నారు. ఒక చెరువు నిండితే సమీపంలోని మరో చెరువుకు నీటిని మళ్లించేలా దృష్టి పెట్టామన్నారు. కొండపి నియోజకవర్గంలో పాలేరు లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి రూ.163 కోట్లతో ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చిందని గుర్తు చేశారు. అద్దంకి నియోజకవర్గంలోని కొరిసపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి కూడా రూ.30 కోట్లను కేటాయించామన్నారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా జూన్ నాటికి నీళ్లు ఇచ్చేలా ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేయటంతో పాటు హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం దృష్టి సారించినట్లు మంత్రి చెప్పారు.
కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే వ్యవసాయ సీజన్ నాటికి నీటి వనరులను బలపేతం చేసేలా దృష్టి సారించామన్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భనీటి మట్టం పెంచేలా ప్రణాళిక
రూపొందించినట్లు చెప్పారు. ఈ దిశగా అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన ఆదేశించారు. ఈ పనులకు మినరల్ ఫండ్స్ కూడా వినియోగిస్తామన్నారు. తద్వారా జిల్లాలో సాగు, తాగునీటికి ఎలాంటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్.ఈ. వరలక్ష్మి, డ్వామా పి.డి. జోసఫ్ కుమార్, జడ్పీ సీఈవో చిరంజీవి, ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, వల్లూరమ్మ ఆలయ కమిటీ చైర్మన్ బొజ్జ శ్రీనివాసులు, ఈవో రమేష్, సాగునీటి సంఘం అధ్యక్షులు బి. వెంకటేశ్వర్లు, స్థానిక అధికారులు పాల్గొన్నారు.

