హైదరాబాద్ ఏప్రిల్ 6, (జే ఎస్ డి ఎం న్యూస్ ) :
రాష్ట్రం లో ప్రతి పౌరుడు కి సురక్షితమైన పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారంఫుడ్ సేఫ్టీ అవేర్నెస్ వాకథాన్‌ను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జల విహార్ వద్ద జెండా ఊపి వాక్ ను ప్రారంభించారు.ఈ వాక్‌లో సుమారు వెయ్యి మంది విద్యార్థులు, యువత పాల్గొన్నారు.జలవిహార్ నుంచి ఐమ్యాక్స్ పక్కనున్న హెచ్ఎండీఏ గ్రౌండ్స్ వరకూ ఫుడ్ సేఫ్టీ అవేర్నెస్ వాకథాన్ ఉత్సాహంగా సాగింది. ఈవాకథాన్ లో ఆరోగ్యశాఖ మంత్రి తో పాటు ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, ఫుడ్ సేఫ్టీ కమిషనర్ సంగీత సత్యనారాయణ, హైదరాబాద్ కలెక్టర్ హరిచందనలు జల విహార్ నుంచి హెచ్ఎండీఏ గ్రౌండ్స్ వరకూ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెంట నడిచారు.హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో వాకథాన్ ముగింపులో మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూఫుడ్ సేఫ్టీ అవగాహన వాక్‌థాన్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్న అన్నారు.
గత కొన్నేళ్లుగా ప్రజల ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో గణనీయమైన మార్పులుచోటుచేసుకున్నాయనీ, బిజీ లైఫ్ స్టైల్ లో వేగంగా జరుగుతున్న అర్బనైజేషన్ వల్ల ఇంట్లో వంట చేసుకోవడం తగ్గిపోయిందన్నారు.బయట హోటళ్లు, రెస్టారెంట్లలో తినడం, ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం విపరీతంగా పెరిగింది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా రాష్ట్రంలో ఫుడ్ ఇండస్ట్రీ కూడా వేగంగా విస్తరించిందన్నారు.ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా.. చిన్నవి, పెద్దవి అన్నీ కలిపి సుమారు 1.41 లక్షల ఫుడ్ బిజినెస్ సంస్థలు ఉన్నాయి. వీటిలో దాదాపు 80 శాతం పట్టణ ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉండటం, నగరాల్లో రెడీ టు ఈట్ ప్రాసెస్డ్ ఆహార పదార్థాలకు ఉన్న అధిక డిమాండ్‌ను స్పష్టంగా తెలియజేస్తోందనీ ఆయన పేర్కొన్నారు.దురదృష్టవశాత్తూ, ఈ పరిస్థితిని కొంతమంది దుర్వినియోగం చేస్తూ దాదాపు ప్రతి ఆహార పదార్థంలో కల్తీకి పాల్పడుతున్నారు. ఉప్పు, పప్పులు, చింతపండు, చక్కెర, చాయిపత్తీ… దేన్నీ వదలడం లేదు.మరోవైపు, ఇంకొంతమంది నాసిరకం నూనెలు, నాణ్యతలేని పదార్థాలతో ఆహారం తయారు చేసి ప్రజలకు విక్రయిస్తున్నారు.ఇటువంటి కల్తీ, నాసిరకం ఆహారం వినియోగం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. కల్తీ, నాసిరకం ఆహారం తిన్న ప్రజలు జీర్ణకోశ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు.దీర్ఘకాలంలో మధుమేహం, రక్తపోటు, గుండె, మూత్రపిండాల వ్యాధులు, అధిక బరువు వంటి సమస్యలకు కూడా కల్తీ, నాసిరకం ఆహారం కారణమవుతోందని డాక్టర్లు చెబుతున్నారు.హైదరాబాద్‌తో పాటు తెలంగాణ అంతటా నాన్-కమ్యూనికబుల్ వ్యాధుల భారం పెరుగుతుండటానికి అనారోగ్యకర ఆహార అలవాట్లు ఒక ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి.
ఈ రోగాల వల్ల ప్రజలు శారీరకంగా ఇబ్బంది పడడంతో పాటు, ఆర్థికంగా కూడా నష్టపోతున్నారు.
పరోక్షంగా ఇదంతా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతోంది.ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఫుడ్ సేఫ్టీ శాఖ, పోలీస్ శాఖల సమన్వయంతో రాష్ట్రవ్యాప్తంగా నిరంతర తనిఖీలు, ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్‌లు కొనసాగుతున్నాయి.
గత రెండేళ్లలో 11,000కు పైగా తనిఖీలు నిర్వహించి, కల్తీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నాం.
నాసిరకం, కల్తీ పదార్థాలతో ఆహారం తయారు చేసి అమ్ముతున్న హోటళ్లు, రెస్టారెంట్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం.
భవిష్యత్తులో ఈ తనిఖీలను మరింత కఠినతరం చేసి, ఎలాంటి రాజీ లేకుండా చర్యలు కొనసాగిస్తాం.
ఫుడ్ సేఫ్టీ అమలు వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. కొత్తగా 24 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లను నియమించాం. 5 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ వాహనాలను రంగంలోకి దింపాం.నిజామాబాద్, హన్మకొండ, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో రూ.15 కోట్ల వ్యయంతో 3 కొత్త రీజినల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహార నాణ్యత, ప్రజారోగ్య విషయంలో ఎటువంటి రాజీ ఉండదని ఇప్పటికే స్పష్టం చేశారనీ మంత్రి గుర్తు చేశారు.డ్రగ్స్ నిర్మూలనకు ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టుగా, ఫుడ్ సేఫ్టీ కోసం కూడా ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం సంకల్పించారన్నారు.శాస్త్రీయ అధ్యయనం అనంతరం, త్వరలోనే ఒక కొత్త వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చి.. ఆహార కల్తీ కేటుగాళ్లపై పీడీ యాక్ట్ వంటి కఠిన చర్యలు తీసుకుంటాం.ప్రతి పౌరుడికి సురక్షితమైన, పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం.అదే సమయంలో, ఫుడ్ ఇండస్ట్రీ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది.ఈ రంగం అభివృద్ధిని ప్రభుత్వం ప్రోత్సహిస్తూనే, బాధ్యతతో కూడిన వృద్ధిని కూడా ఆశిస్తోంది.ఫుడ్ సేఫ్టీ అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ఆహార ఉత్పత్తిదారులు, వ్యాపారులు, వినియోగదారులందరి సమిష్టి బాధ్యత.ఈట్ రైట్ – స్టే హెల్తీ” అనే సందేశాన్ని అందరం ఆచరిద్దాం.కలిసికట్టుగా ఆరోగ్య తెలంగాణ నిర్మించుకుందాం అని మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపునిచ్చారు.


