రెవిన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. బుధవారం ఆయన వలేటివారిపాలెం తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలో రెవెన్యూ సమస్యలు, గ్రీవెన్స్ అర్జీలను పరిష్కరిస్తున్న తీరుపై సబ్ కలెక్టర్ డి. హిమవంశీతో కలిసి ఆయన సమీక్షించారు. మండలానికి త్వరలోనే రెగ్యులర్ తహసీల్దారును నియమిస్తామని చెప్పారు. రెవిన్యూ సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోని స్పష్టం చేశారు. గ్రీవెన్స్ అర్జీలను సకాలంలో పరిష్కరించాలని, అర్జీదారులకు సహేతుకమైన ఎండార్స్మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. మండల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపైనా కలెక్టర్ సమీక్షించారు. ఈ ప్రాంతంలో మైనింగ్ చేపట్టనున్న జె.ఎస్. డబ్ల్యు. కంపెనీ కోసం అవసరమైన భూముల లభ్యత, వాటి సర్వే, సేకరణ కోసం స్థానికంగా చేపడుతున్న చర్యలపై కలెక్టర్ ఆరా తీశారు. 167 (బి) రోడ్డుకు భూసేకరణ – పరిహారం చెల్లింపుపైనా ఆయన సమీక్షించారు. ఈ పనులను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. మండలంలో ఉపాధి హామీ పనులను ముమ్మరంగా చేపట్టాలని, ఉపాధి కూలీలను పూర్తిస్థాయిలో పనులలో భాగస్వాములను చేయాలని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో ప్రత్యేకంగా చేపట్టిన మంచినీటి ట్యాంకుల శుద్ధీకరణ ప్రక్రియలో నిర్లక్ష్యం ఉండకూడదని ఆయన పునరుద్ఘటించారు. నీటి వనరులకు అవసరమైన మరమ్మతులు చేపట్టి పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ జలధార – జల హారతి ‘ కార్యక్రమాన్ని మండలంలో విజయవంతంగా నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళిక పైనా కలెక్టర్ ఆరా తీశారు. ఆయా కార్యక్రమాలను మండల స్థాయిలో అధికారులు సమన్వయంతో చేపట్టాలని దిశా నిర్దేశం చేశారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయంలోని రికార్డు రూము, ఇతర సెక్షన్లను వారు పరిశీలించారు. రికార్డుల భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. తమ సమస్యల పరిష్కారం కోసం తహసిల్దార్ కార్యాలయానికి వచ్చిన ప్రజలతోనూ వారు మాట్లాడారు.
వారి వెంట డిప్యూటీ తహసిల్దార్ మధుబాబు, ఎంపీడీవో, ఏపీవో, ఇతర అధికారులు ఉన్నారు.

