బేగంపేట ,ఏప్రిల్ 10 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట పాటిగడ్డ ఆర్ అండ్ బి క్వార్టర్లే అడ్డాగా అక్రమ రేషన్ బియ్యం దందా సాగుతున్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. స్థానికంగా ఉన్న కొందరు కార్డుదారుల నుంచి రేషన్ బియ్యాన్ని అతి తక్కువకు కొనుగోలు చేసి వాటిని అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఈ ముఠా సభ్యులు ద్విచక్ర వాహనాలు పై ప్రకాశం నగర్ ,పాటిగడ్డ, భగవంతా పూర్, తదితర బస్తీల్లో తిరుగుతూ ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డుల ద్వారా అందిస్తున్న బియ్యాన్ని తక్కువ మొత్తం చెల్లించి కొనుగోలు చేసి, వాటిని తెల్ల గోతాలలో ప్యాక్ చేసి అధిక ధరలకు విక్రయిస్తూ అధిక లాభాలు దండు కుంటున్నట్లు సమాచారం. వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన బియ్యాన్ని పాటిగడ్డలోని ఆర్ అండ్ బి క్వార్టర్స్ లో నిల్వచేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారని తెలిసింది .అయితే గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారంలో ప్రాంతీయ పార్టీకి చెందిన వ్యక్తి వ్యాపారికి పోలీసులకు మధ్య వారధిగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని గమనించిన కొందరు బేగంపేట పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ వారు అంటి ముట్టనట్లుగావ్యవహరిస్తున్నట్లుఆరోపణలున్నాయి.ఈ వ్యవహారానికి సంబంధించి కొద్ది రోజుల క్రితం స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆర్ అండ్ బి క్వార్టర్స్ వద్దకు చేరుకోగా, ప్రాంతీయ పార్టీ నేత రంగంలోకి దిగి వారిని అక్కడ నుంచి వెళ్లిపోయేలా చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. గడిచిన నాలుగైదు నెలలుగా ఇక్కడ దండ ఇదే విధంగా సాగుతున్నా ,పోలీసులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాటిని ఆరికట్టాల్సిన పోలీసులు మౌనం పాటించడం ఏంటని స్థానిక ప్రజలు ఆక్షేపిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ,ఈ దందా పై స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించి పూర్తిస్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
పూర్తిస్థాయి విచారణ చేసి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటాం …బేగంపేట ఏసిపి గోపాలకృష్ణమూర్తి.
బేగంపేట పరిధిలో జరుగుతున్న అక్రమ రేషన్ బియ్యం వ్యవహారం తన దృష్టికి రాలేదని ,
ఈ విషయంపై పూర్తిస్థాయి విచారణ చేసి బాధ్యులపై తగిన చర్యలు
తీసుకుంటామని బేగంపేట ఏ సి పి గోపాలకృష్ణమూర్తి అన్నారు. బేగంపేటలో జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ దందా విషయంపై ఎసిపి వివరణ కోరగా పై విధంగా స్పందించారు. ఈ విషయంలో ఎవరు ఉన్నా వదిలేది లేదని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.