ప్రజల సమక్షంలోనే వారి సమస్యలను పరిష్కరించేందుకు ‘ పల్లెనిద్ర ‘ చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. శుక్రవారం ఆయన దర్శి మండలంలోని పోతవరం గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక శివాలయం వద్ద గ్రామస్తులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు ప్రస్తావించిన సమస్యలను ఓపికతో విని వాటి
పరిష్కారానికి అప్పటికప్పుడే అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులతోనూ కలెక్టర్ ప్రత్యేకంగా ముచ్చటించారు.
గ్రామ సమస్యలు ఇవీ…
👉 గ్రామంలో సీసీ రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది. అలాగే దెబ్బ తిన్న పోతవరం – తిమ్మాయిపాలెం రోడ్డు కు మరమ్మత్తు లు చేపట్టాలి.
👉 సైడ్ డ్రెయిన్లు నిర్మించాలి. తానంచింతల గ్రామంలో రోడ్డు ఆక్రమణ గురైంది . ఆక్రమణ తొలగించి రోడ్డు వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది. గ్రామ సమీపంలో వున్న చెరువుకు దర్శి కెనాల్ నుండి నీటిని సరఫరా చేయాలి.
👉 భూ సమస్యలను పరిష్కరించి పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పించాలి.
👉 గ్రామంలోని వాటర్ ట్యాంకు ను క్లీన్ చేయాలి.
👉 ఈ నియోజక వర్గంలో నీటి సమస్య ఎక్కువగా ఉంది. నీటి సమస్య పరిష్కారానికి అధికారుల చొరవ చూపాలి.
👉 తాత్కాలికంగా మంజూరు కాబడిన సదరన్ సర్టిఫికెట్స్ స్థానంలో పర్మనెంట్ సదరన్ సర్టిఫికెట్స్ గా మంజూరు చేయాలి.
👉 మండలంలో ఎక్కువ సంఖ్యలో అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనంలో నడుస్తున్నాయి, వీటికి సొంత భవనాలు నిర్మించాలి.
👉 దేవరం గ్రామంలో చాలా సంవత్సరాలుగా సుమారు 90 మంది సన్నకారు, చిన్న కారు రైతులు ప్రభుత్వ భూమిని సాగు చేసుకోవడం జరుగుచున్నది. సాగుచేసుకుంటున్న రైతులకు గుర్తింపు కార్డు ఇప్పించాలి.
👉 దర్శి నియోజకవర్గం పరిధిలో చాలా మంది డయాలసిస్ పేషంట్స్ ఉన్నారు. వీరు చికిత్స నిమిత్తం మార్కాపురం, కనిగిరికి పోతున్నారు. దర్శి ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటుచేయాలి.
ఈ సమస్యల పరిష్కారానికి తక్షణమే దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని, అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ముందుగా గ్రామంలోని శివాలయంలో ప్రత్యేకంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఆలయ సమీపంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యురాలు, దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి గొట్టిపాటి లక్ష్మి, అద్దంకి ఆర్.డి.ఓ. జాన్సన్, వివిధ శాఖల జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.





