ప్రతిపక్షాలు మీడియా సాయంతో చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టడానికే గృహ సారథులు, సచివాలయం కన్వీనర్లతో కూడిన సమాంతర వ్యవస్థను అభివృద్ధి చేసినట్టు టిటిడి ఛైర్మన్, వైఎస్సార్ సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. సంక్షేమ పథకాల అమలు ద్వారా పేద ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న మేలు గురించి తెలియజేయడానికే గడప గడపకి మన ప్రభుత్వం పథకాన్ని రూపకల్పన చేశామని ఆయన తెలిపారు. యలమంచిలిలో ఆదివారం జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులకు విస్తృత ప్రచారం కల్పించాలని, ప్రతి ఇంటికి ప్రభుత్వ పరంగా చేసిన లబ్ధిని వివరించాలని సూచించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నారని ప్రశంసించారు. పేద ప్రజల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వైద్యం, విద్య అందుబాటులోకి తీసుకురావడానికి స్వర్గీయ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి దేశంలోనే మొదటిసారి ఆరోగ్యశ్రీ,, ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు చేశారని, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు కోసం అంతకు మించిన పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. పార్టీ అభ్యున్నతి కోసం పని చేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు, న్యాయం జరుగుతాయని హామీ ఇచ్చారు. నేవల్ బేస్ ఏర్పాటుతో ఉపాధి కోల్పోతున్న 8 మత్స్యకార గ్రామాల ప్రజల కోసం కేంద్ర రక్షణ శాఖ మంత్రితో మాట్లాడాలని పార్టీ ఎంపీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని చెప్పారు. రెండు నెలల్లో ఆమోదయోగ్యమైన పరిష్కారం అభిస్తుందని సుబ్బారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. పేద ప్రజానీకం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలతో సంపూర్ణ విజయాన్ని బహుమతిగా అందించాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ,, యలమంచిలి ఎమ్మెల్యే యు.వి.రమణమూర్తిరాజు, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, గవర కార్పొరేషన్ బొడ్డేటి ప్రసాద్, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్, సుకుమార్ వర్మ తదితరులు పాల్గొన్నారు.


