ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) చందాదారులు తమ భవిష్యనిధి ఖాతాలో సొమ్ము నిల్వల వివరాలు తెలుసుకునేందుకు కష్టాలు ఎదురవుతున్నాయి. పది రోజులుగా ఈపీఎఫ్‌వో పాస్‌బుక్ వెబ్‌సైట్ నిలిచిపోవడం, ఈపీఎఫ్‌వో మెంబర్ (సభ్యుల) పోర్టల్‌లోనూ సాంకేతిక సమస్యలతో కనీస సేవలు పొందలేకపోతున్నారు. పాస్‌బుక్ కోసం ప్రయత్నించిన వారికి ‘ఈరోజు సాయంత్రం 5 గంటల తరువాత సేవలు అందుబాటులోకి వస్తాయి’ అనే సమాచారం కనిపిస్తోంది. రోజూ ఎప్పుడు తెరిచినా ఇదే సమాచారం రావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అత్యవసర సమయంలో గృహనిర్మాణం, స్థలం కొనుగోలు, వైద్య ఖర్చులు, పిల్లలకు ఫీజులు, వివాహం తదితర అవసరాలతో పాటు పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పీఎఫ్ ఉపసంహరణ, పింఛను దరఖాస్తు తదితర పనులకు సర్వర్ పనిచేయకపోవడంతో సభ్యుల పోర్టల్ మొరాయిస్తోంది. ఒకవేళ వెబ్‌సైట్ తెరుచుకున్నా దరఖాస్తు చేయడానికి సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
వడ్డీలేదు.. సమాచారం ఉండదు…
పీఎఫ్ చందాదారులకు ప్రతిఏటా ఈపీఎఫ్‌వో వడ్డీని జమచేస్తుంది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరుసటి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే నాటికి జమచేసి, ఆ వివరాలను చందాదారుడికి తెలియజేయాలి. ఈసమాచారం ఈపీఎఫ్‌వో ఆన్‌లైన్ పాస్‌బుక్‌లో పేర్కొనాలి. కానీ గత ఆరేళ్లుగా ఈ సంప్రదాయం అమలు కావడం లేదు. గడిచిన ఆర్థిక సంవత్సరానికి ఇవ్వాల్సిన వడ్డీని మరుసటి ఏడాది నవంబరు, డిసెంబరులో జమచేస్తూ వచ్చింది. ప్రస్తుతం దాదాపు రెండేళ్లు గడుస్తున్నా వడ్డీ ఇంకా జమ చేయలేదు. 2021-22 ఏడాదికి సంబంధించిన వడ్డీ ఇప్పటివరకు జమచేయలేదు. మరోవైపు 2022-23 ఏడాదికి సంబంధించి వడ్డీరేటుపై ఇప్పటికే నిర్ణయం జరగాల్సి ఉన్నా.. ఆ మేరకు చర్యలు లేవు. మరో రెండు నెలలు గడిస్తే నిల్వలపై వడ్డీ బకాయిలు రెండేళ్లకు చేరుకుంటాయి. వడ్డీ బకాయిలను ఇప్పటికే జమ చేశామని, సాఫ్ట్‌వేర్ అప్‌డేషన్ కారణంగా ఆ వివరాలు కనిపించడం లేవని గతంలో ఈపీఎఫ్‌వో తెలిపింది. కానీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఏడాదిన్నరగా కొనసాగుతుండటంతో చందాదారుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.