“భావానికి తగిన భాషను సంక్షిప్తంగా వాడండి. ప్రముఖ భాషావేత్తల పుస్తకాలను చదవండి” – “తెలుగు భాష పేరిట పదాల తర్జుమా తో భాషను పామరులకు దూరంకానీకండి.” – “నిరుపేదలకు సామాజిక, ఆర్ధిక అభివృద్ధి కల్పించడంలో వై.ఎస్. జగన్ మోహన రెడ్డి శ్రీ రాముడైతే, తాను భక్తరామదాసులాంటి వాడిని” – రాష్ట్ర కమ్యూనికేషన్ సలహాదారు శ్రీ జి.వి.డి. కృష్ణ మోహన్

భాషను సంక్షిప్తంగా వాడుకోవడం ప్రస్తుత జర్నలిజం శైలి కి అత్యంత అవసరమని రాష్ట్ర కమ్యూనికేషన్ సలహాదారు శ్రీ జి.వి.డి. కృష్ణ మోహన్ అన్నారు. సి. రాఘవాచారి మీడియా అకాడమీ అద్వర్యం లో ప్రతి శనివారం నిర్వహించే ఆన్ లైన్ అవగాహన తరగతుల్లో ప్రత్యేక ప్రసంగం చేశారు. “భాషా పరిజ్ఞానం – పదునైన భాష వాడకం” అనే అంశం పై మాట్లాడుతూ పేజీలు పేజీలు చదివే ఓపిక లేని రోజుల్లో మన భావాన్ని సాధ్యమైనంత సంక్షిప్త పదాల్లో వ్యక్తం చేయడం ముఖ్యమన్నారు. పక్షి కూత అంతటి స్వల్ప పరిమాణంలో “ట్విట్టర్” వంటి, డిజిటల్ వేదికలు సమాచారాన్ని చేర వేస్తోన్న ప్రస్తుత పరిస్థితులు మనకు సంక్షిప్తత అవసరాన్ని నొక్కి చెపుతున్నాయన్నారు. ట్విట్టర్, పేస్ బుక్ వంటి డిజిటల్ మాధ్యమాలకు ప్రజల ఆమోదం రోజు రోజు కు ఎక్కువ అవుతోందన్నారు. దీనికి ప్రధాన కారణం క్షణం తీరిక లేని పనిఒత్తిడి, పఠనాసక్తి రోజు రోజు కు తగ్గిపోతుండడం కారణాలు అని ఆయన పేర్కొన్నారు. వార్త రాసేటపుడు, ఎడిటింగ్ చేసేటపుడు ఈ అంశాన్ని పరిగణన లోకి తీసుకోవాలని సూచించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

1990 దశకంలో విద్యార్ది ఉద్యమాలు, సామాజిక ఉద్యమాల నేపాధ్యం నుంచి జర్నలిజం లో ప్రవేశించిన వారు భాష పై పట్టుకలిగి ఉండేవారన్నారు. 1990 దశకంలో విద్యార్ది ఉద్యమాలు, సామాజిక ఉద్యమాల నేపాధ్యం నుంచి జర్నలిజం లో ప్రవేశించిన వారు భాష పై పట్టుకలిగి ఉండేవారన్నారు. వీరికి ఆయా సమాజాలపై, వ్యవస్థలపై, భాషపై, పూర్తి అవగాహన ఉండేదని, వారి భావ వ్యక్తీకరణ అవసరమైన స్థాయి లోనే సంక్షిప్తంగా, సరళంగా వుంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం బి.టెక్ చదివిన వారు జర్నలిజం రంగం లోకి వస్తున్నారని, ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని ఆయన అన్నారు. అయితే, ప్రింట్, ఎలెక్ట్రానిక్, డిజిటల్ మీడియా కు రాయడంలో మరిన్ని మెళుకువలు వీరు నేర్చుకోవాల్సివుంటుందన్నారు. భాష పరమైన సామెతలు,జాతీయాలు, నుడికారాలు పై అధ్యయనం చేయాలని సూచించారు. ఇందుకు పుస్తకాలు చదవడం చాలా అవసరమన్నారు. . బూదరాజు రాధాకృష్ణ, తల్లాప్రగడ సత్యన్నారాయణ మూర్తి వంటి భాషావేత్తలు రచించిన పుస్తకాలు ఇందుకు దోహద పడతాయన్నారు. తెలుగు, ఆంగ్ల పదాల నిఘంటువులు జర్నలిస్టులు ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలన్నారు.

తాము వ్రాసిన వార్తను తిరిగి సంక్షిప్తం చేసేందుకు ప్రయత్నించడం వల్ల సంక్షిప్తంగా వ్రాయడం అలవాడుతుందన్నారు. అందరికీ అర్ధమయ్యే “పదాలు” వాడడమే ముఖ్యంగాని, ప్రామాణికమనే భ్రమలో పదాలను తెలిగించడం సరైనది కాదన్నారు. తెలుగు భాషలో కొన్ని పదాలు ఇతర భాషలనుంచి స్వీకరించి మన వ్యవహారికంలోకి వచ్చాయన్నారు.
అర్ధవంతంగా పదాలను మనం వాడుతున్నామా లేదా అనేది మాత్రం ప్రధానమన్నారు. వ్యవహారికం లో వున్న ఆంగ్ల, సంస్కృత, ఇతర భాషా పదాలను అలాగే వాడడం తప్పుకాదన్నారు. మనం రాస్తోన్నభాష పామరులకు, కొద్దిపాటి అక్షరాస్యులకు అర్ధమయితే చాలన్నారు. ఎక్కువ మంది మాట్లాడే భాషలో వేరువేరు ప్రాంతాలకు వేరువేరు మాండలికాలుండడం సహజమన్నారు. ఆయా ప్రాంతాల్లో అర్ధమయ్యే మాండలికాలను వాడడం కూడా తప్పు కాదన్నారు. కుల వృత్తులనుంచి అనేక పదాలు భాషలోకి ఇమిడి పోయాయని, “చక్రం తిప్పుతున్నాడు” లాంటి అనేక పదాలు మన వాడుకలో నిత్యం దొర్లుతుండడం మనం చూస్తుంటామని అన్నారు. ఇలా భాష మన సంస్కృతిలో ఒక భాగమైపోయిందన్నారు. తెలుగు లో తర్జుమా చేసి పదాలను క్లిష్టం చేసి, ప్రజలకు భాషను దూరంచేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

మనం పెరిగిన ప్రాంతం లోని భాష, మాండలికాల ప్రభావం మనపై జీవితాంతం ఉంటుందన్నారు.
జర్నలిజం వృత్తిని ఉద్యోగం గా ఎంచుకుని పనిచేస్తున్న సమయంలో తాను “తెలుగు భాష” మీద పట్టు పెంచుకోవాలనుకు ని అనేక పుస్తకాలను అధ్యయనం చేశానని ఆయన చెప్పారు. భాషకు, మాండలికాలు, సామెతలు, నుడికారాలు సంబంధించి తెలిపే అనేక పుస్తకాలను ఇప్పటికీ లైబ్రరి నుంచి తెచ్చుకుని చదువుతానని చెప్పారు. జర్నలిస్టు లకు పట్టుదల, కమిట్ మెంటు వుంటే రాణింపు ఉంటుందని తెలిపేందుకు తాము ఉదాహారణ అని ఆయన చెప్పారు. జర్నలిస్టులను తమతో సమానంగా ఉన్నతికి తీసుకుపోయే సంస్కారం ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన రెడ్డి స్వంతం అన్నారు. అనేక మంది జర్నలిస్టులతో పాటు తమకు ప్రభుత్వం లో ఉన్నత స్థానం కల్పించిన ముఖ్య మంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నిరుపేదలకు సామాజిక, ఆర్ధిక అభివృద్ధి కల్పించడం లో శ్రీ వై.ఎస్. జగన్ మోహన రెడ్డి శ్రీ రాముడైతే, తాను భక్తరామదాసులాంటి వాడిని అని ఆయన అన్నారు.

జర్నలిజం కెరీర్ గా ఎంచుకోవడంతో పాటు, ఆ వృత్తిలో రాణించాలనే తపన, పట్టుదల వున్నవారిని ఎవరూ ఆపలేరన్నారు. అక్షరాన్ని సరిగ్గా ఉపయోగించుకుని, భావానికి పదును పెట్టగలిగితే, అవకాశాలు అపారమని ఆయన అన్నారు. ఎప్పటికప్పుడు సమాజపరమైన, కుటుంబపరమైన, భాషా పరమైన మార్పులను, గమనిస్తూ, జర్నలిజం ను ఆచరణాత్మక “సోషల్ ఇంజనీరింగ్” గా భావించాలని ఆయన సూచించారు.

అంతకు ముందు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు “నేటి ప్రసార మాధ్యమాలు” అనే అంశం పై దూరదర్శన్ రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ప్రత్యేక ప్రసంగం చేశారు.

ఈ ఆన్ లైన్ అవగాహన సదస్సు కు మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీ కొమ్మినేని శ్రీనివాస రావు అధ్యక్షత వహించారు. కోర్సు డైరెక్టర్ శ్రీ ఎల్.వి.కె. రెడ్డి వక్తలను పరిచయం చేశారు. మీడియా అకాడమీ కంటెంట్ ఎడిటర్ శ్రీ కలమండ శరత్ బాబు సమన్వయకర్తగా వ్యవహరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *