తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం జరిగిందని మాజీమంత్రి, MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ గుర్తుచేశారు. సనత్ నగర్ నియోజకవర్గం నుండి మూడవసారి భారీ మెజార్టీతో MLA గా గెలుపొందిన సందర్బంగా శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్ లకు చెందిన పార్టీ నాయకులు, వివిధ కాలనీల ప్రతినిధులు వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో కలిసి పుష్పగుచ్చాలను అందజేసి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. PG రోడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సన్మానించారు. ఈ సందర్బంగా వారితో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావానికి ముందు PG రోడ్డులో సరైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్తలు లేక వర్షాకాలంలో స్థానిక ప్రజలే కాకుండా వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడేవారని వివరించారు. తాను వచ్చిన తర్వాతనే సుమారు 40 కోట్ల రూపాయల వ్యయంతో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చడం జరిగిందని, వైట్ టాపింగ్ రోడ్లను నిర్మించి అద్బుతంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. అదేవిధంగా నాలాలో పూడిక తొలగింపు, నూతనంగా వంతెనలను నిర్మించి వర్షాకాలంలో వరద ముంపు సమస్య తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపినట్లు వివరించారు. ఇవేకాకుండా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తోమ్మిదిన్నార సంవత్సరాల కాలంలో నియోజకవర్గ పరిధిలో సుమారు 1400 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పనులను చేపట్టి ప్రజలు ఎదుర్కొంటున్న అనేక దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించామని చెప్పారు. ఎవరు ఊహించని విధంగా 50 సంవత్సరాలలో జరగని అభివృద్దిని చేసి అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో ప్రజలు తెలియజేశామని అన్నారు. PG రోడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అద్యక్షుడు ప్రవీణ్, సంజయ్ పత్తిపాక, గోపాల్, రోచా బాయ్, నవీన్ షా, బర్కత్ బాయ్, దీపక్, శృతి పత్తిపాక, జగదీశ్ ప్రసాద్ వర్మ తదితరులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఘనంగా సన్మానించి శుభాభినందనలు తెలిపారు.






