క్లినిక్ నిర్వాహకునికి 25 వేల రూపాయల పెనాల్టీ విధించిన బేగంపేట
డీసీ సమ్మయ్య……………………
రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ చెత్త వేయవద్దని ,ఇంటి వద్దకు వచ్చే జిహెచ్ఎంసి చెత్త ఆటోలోనే చెత్తను వేయాలంటూ జిహెచ్ఎంసి అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. అయినా ప్రజల్లో మాత్రం మార్పు అంతగా రాలేదని చెప్పాలి. చెత్తను కవర్లలో కట్టి రోడ్ల పైన పారవేసి పోతూనే ఉన్నారు. శనివారం బేగంపేట డివిజన్ పరిధిలోని పాటి గడ్డలో బేగంపేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వి. సమ్మయ్య పారిశుద్ధ్య నిర్వహణపై తనిఖీలు చేశారు. ఈ తనిఖీలలో బేగంపేట పాటిగడ్డలో మెడికల్ వ్యర్ధాలను రోడ్డు మీద పడవేసి ఉన్న దృశ్యాన్ని గుర్తించారు. వెంటనే చెత్తను పరిశీలించగా హర్షిత క్లినిక్ నిర్వహిస్తున్న ఆర్ఎంపి మహమ్మద్ రఫీక్ అనే వ్యక్తి మెడికల్ వ్యర్ధాలను అక్కడ రోడ్డు మీద వేసినట్లు గుర్తించారు. వెంటనే అతనికి రూ 25000లు పెనాల్టీ విధించారు. ఈ సందర్భంగా బేగంపేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వి .సమ్మయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చెత్తను ఇళ్ళ ముందుకు వచ్చే జిహెచ్ఎంసి ఆటోలకే అందించాలన్నారు. అలా కాకుండా రోడ్లపై చెత్త వేస్తే
కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఆర్ఎంపీలు, పీఎంపీలు, ప్రైవేట్ క్లినిక్ లు,ల్యాబ్ లు నిర్వహించే వారు వారు ఉపయోగించిన మెడికల్ వ్యర్ధాలను రోడ్లపై గాని బయట గాని పడవేయ వద్దన్నారు. వాటిని బయో మెడికల్ వేస్ట్ తీసుకొని వెళ్లే వాహనానికి మాత్రమే అందించాలన్నారు. ఈ తనిఖీలలో శానిటేషన్ సూపర్ వైజర్ ధనాగౌడ్, జవాన్ కృష్ణ ,సాయినాథ్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

