పర్యావరణ అనుకూల నూతన ఆవిష్కరణలు మరియు స్థిరత్వం జోన్ అంతటా రైల్వే స్టేషన్లు మరియు ఇతర రైల్వే ప్రాంగణాల్లో పర్యావరణ అనుకూల పద్ధతులను అమలు చేయడంలో దక్షిణ మధ్య రైల్వే ముందంజలో ఉంది. ఇందులో భాగంగా, దక్షిణ మధ్య రైల్వేకు చెందిన సికింద్రాబాద్ డివిజన్ లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పరిశుభ్రత మరియు స్థిరత్వాన్ని పెంపొందించడానికి అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఈ స్టేషన్‌లో రోజుకు సగటున 2 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. రోజుకు దాదాపు 197 ప్యాసింజర్ రైళ్లు స్టేషన్‌లో రాకపోకలు సాగిస్తున్నాయి. భారతీయ రైల్వేల ప్రయాణికులకు అత్యున్నత స్థాయి సేవలను అందించడంతోపాటు సుస్థిరతను సాధించాలనే లక్ష్యానికి అనుగుణంగా సికింద్రాబాద్ స్టేషన్ పర్యావరణ అనుకూల పద్ధతులను అవలంబిస్తూ ఆదర్శ స్టేషన్ గా మారింది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇంధన సామర్థ్యం మరియు పర్యావరణ అనుకూల నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఈ స్టేషన్ లో 100% ఎల్.ఈ.డి లైటింగ్, శక్తి-సమర్థవంతమైన బి.ఎల్.డి.సి ఫ్యాన్‌లు మరియు ఇన్‌వర్టెడ్ స్టార్-రేటెడ్ ఎయిర్ కండిషనింగ్ యూనిట్ లు ఏర్పాటుచేయబడ్డాయి. స్టేషన్ 500 కె. డబ్లు.పి సోలార్ పవర్ సిస్టమ్ నుండి ప్రయోజనం పొందడం ద్వారా కార్బన్ ఉద్గారలను తగ్గించడంలో దోహదపడుతోంది .
భారతీయ రైల్వేలలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మొట్టమొదటి అత్యధిక 94% స్కోర్ తో ఐ.జి.బి.సి– కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీ.ఐ.ఐ) నుండి ప్రతిష్టాత్మకమైన గ్రీన్ రేటింగ్ ఆఫ్ ‘ప్లాటినం’ గ్రేడ్‌ను సాధించింది మరియు ఐ.ఎస్.ఓ 14001:2015 సర్టిఫికేషన్ నం కూడా 12.07.2027 వరకు పొందింది. రిసోర్స్ మేనేజ్‌మెంట్‌లో ఉత్తమ పద్ధతులకు కట్టుబడి ఉండేందుకై రెగ్యులర్ వాటర్ మరియు ఎనర్జీ ఆడిట్‌లు కొనసాగుతాయి .
సికింద్రాబాద్ స్టేషన్‌లో చేపట్టిన కొన్ని పర్యావరణ హిత కార్యక్రమాలు :
నీటి సంరక్షణ మరియు రీసైక్లింగ్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సమర్థవంతమైన నీటి నిర్వహణ వ్యూహాన్ని అవలంబించారు . స్టేషన్‌లో ఏర్పాటు చేయబడిన 500 కె. ఎల్. డి సామర్థ్యంతో ఏర్పాటు చేసిన (నీటి రీసైక్లింగ్) మురుగునీటి శుద్ధి కర్మాగారం నీటి వృధాను నిలువరిస్తుంది. ఇది స్టేషన్ యొక్క జీరో వాటర్ వేస్ట్ లక్ష్యానికి మద్దతు దిశగా పనిచేస్తుంది. ఈ వ్యవస్థ స్టేషన్ అంతటా వివిధ అవసరాల కోసం నీటిని రీసైకిల్ చేస్తుంది తద్వారా నీటి పరిరక్షణలో గణనీయమైన పురోగతిని సాధించింది.
ప్లాస్టిక్ రీసైక్లింగ్ మరియు వేస్ట్ మేనేజ్‌మెంట్
ఈ స్టేషన్‌లో ప్లాస్టిక్ వ్యర్థాలను నివారించేందుకు మరియు రీసైక్లింగ్ ప్రయత్నాలలో ప్రయాణికులను పాల్గొనడానికి ప్రోత్సహించడానికి పది ప్లాస్టిక్ బాటిల్ ష్రెడ్డింగ్ మెషీన్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. 26 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ (వేస్ట్ సెగ్రిగేషన్ షెడ్) సమర్థవంతమైన వ్యర్థాల విభజనను నిర్ధారిస్తుంది. ప్రయాణీకులు డబుల్-డస్ట్‌బిన్ సిస్టమ్ ద్వారా మార్గనిర్దేశం చేయబడుతారు. బయో డిగ్రేడబుల్ చెందగల వ్యర్థాలను సేకరించేందుకు ఆకుపచ్చడబ్బాలు మరియు నాన్ బయో డిగ్రేడబుల్ వ్యర్థాలను సేకరించేందుకు నీలిరంగు డబ్బాలు ఈ స్టేషన్ లో ఏర్పాటు చేయబడినాయి. ఈ స్టేషన్లో పరిశుభ్రతను ప్రోత్సహించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా ప్రతిరోజూ సుమారు 4 టన్నుల వ్యర్థాలను తొలగించేందుకు నిర్వహణ ఒప్పందం పురోగతిలో ఉంది.
యాంత్రిక మరియు పర్యావరణ హిత (మెకనైజ్డ్ మరియు ఎకో ఫ్రెండ్లీ క్లీనింగ్) సొల్యూషన్స్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో హౌస్ కీపింగ్ సేవలు ఆధునికీకరించబడ్డాయి. ఈ సేవలను నిర్వహించేందుకు రూ.10.09 కోట్ల విలువైన మూడు సంవత్సరాల ఒప్పందం అమలులో ఉంది. ఈ ఒప్పందంలో రాగ్ పికింగ్, పెస్ట్ కంట్రోల్ మరియు ఎలుకల నివారణతో సహా వివిధ పారిశుధ్య పనులు చేర్చబడినాయి. స్టేషన్ గ్రానైట్ ప్లాట్‌ఫారమ్ ఉపరితలాల కోసం రైడ్-ఆన్ స్క్రబ్బర్ & డ్రైయర్‌లతో సహా 24 అధునాతన శుభ్రపరిచే యంత్రాలను ఉపయోగిస్తుంది. ఫుట్-ఓవర్-బ్రిడ్జ్ క్లీనింగ్ కోసం వాక్-బిహైండ్ స్వీపింగ్ మెషీన్లు మరియు డ్రై, స్లిప్-ఫ్రీ వాష్‌రూమ్‌లను నిర్వహించడానికి వాక్యూమ్ క్లీనర్‌లు. పరిశుభ్రత మరియు పరిశుభ్రత రెండింటి నిర్ధారణ కోసం ఆవిరి శుభ్రపరిచే యంత్రాలు గాజు మరియు టైల్ ఉపరితలాల కోసం ఉపయోగించబడుతున్నాయి .
అదనంగా, సేకరించిన వ్యర్థాలను చెత్త వేరు చేసే షెడ్‌కి తరలించడానికి ఈ-రిక్షా సేవ ఉపయోగించబడుతుంది తద్వారా సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణను మరింత ప్రోత్సహిస్తుంది.
పరిశుభ్రత మరియు ఆరోగ్య అవగాహన ప్రచారంలో ప్రజాపాత్ర మరియు అవగాహన
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిరంతరం పరిశుభ్రత మరియు ఆరోగ్య అవగాహన ప్రచారంలో ప్రయాణీకులను నిమగ్నం చేస్తు పరిశుభ్రతను కాపాడుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. స్టేషన్‌లో మొత్తం 43 టాయిలెట్లు ఉన్నాయి. ఇందులో డీలక్స్ పే-అండ్-యూజ్ సౌకర్యాలు ఉన్నాయి.
ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ స్టేషన్‌లో ఆధునిక & పర్యావరణ అనుకూల చర్యలను అమలు చేసినందుకు సికింద్రాబాద్ డివిజన్ బృందాన్ని అభినందించారు. భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో పర్యావరణ అనుకూల కార్యకలాపాలు మరియు ఆధునిక పరిశుభ్రత పద్ధతుల కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నూతన ప్రమాణాలను ఏర్పాటు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా సుస్థిరత మరియు పర్యావరణ సమతుల్యతను కాపాడే కార్యక్రమంలో భాగంగా ప్రయాణీకులకు పరిశుభ్రమైన మరియు పచ్చటి భవిష్యత్తును అందిస్తాయని ఆయన పేర్కొన్నారు.




