జిల్లాలో నుంచి వెళ్తున్న జాతీయ రహదారులు, ప్రతిపాదిత రైల్వే మార్గాలకు పెండింగ్ భూసేకరణ పనులను త్వరగా పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ ఆదేశించారు. ఈ పనులకు సంబంధించిన అధికారులతో శుక్రవారం ఆయన ప్రకాశం భవనంలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. నడికుడి – శ్రీకాళహస్తి రైల్వే మార్గంతో పాటు 565, 544(డీ), 544(జీ), 216, 765, 167(బీ) జాతీయ రహదారులను సంబంధించిన పెండింగ్ భూ సేకరణ పనుల వివరాలను జాయింట్ కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పునరావాసము, పెండింగ్లో ఉన్న నష్టపరిహారము, కోర్టు కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలని ఆయన దిశా నిర్దేశము చేశారు.
ఈ సమావేశంలో మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాగ్, కనిగిరి ఆర్డిఓ జాన్ ఇర్విన్, ఒంగోలు ఆర్డిఓ సుబ్బారెడ్డి, జాతీయ రహదారులు, రైల్వే శాఖ అధికారులు, సంబంధిత మండలాల తహసీల్దారులు పాల్గొన్నారు.


