గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలా వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలు నగరంలోని అంబేద్కర్ భవనంలో ఆదివారం అఖిలభారత గిరిజన ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డైమండ్ జూబ్లీ ఉత్సవాలకు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్రావు , జాతీయ ఎస్టి కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్తో కలిసి మంత్రి పాల్గొన్నారు. కార్యక్రమానికి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ బాలాజీ నాయక్ అధ్యక్షత వహించారు.
ముందుగా అంబేడ్కర్ భవన్లోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన అతిధులను సత్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ….రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా ప్రభుత్వం ఒకటో తేదీ గుర్తుండేలా ఉద్యోగులందరికీ జీతాలు ఇస్తున్నట్లు చెప్పారు. అర్హులైన పేదలందరికీ ఒకటో తేదీన పెన్షన్ అందిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి గిరిజనులపై ప్రత్యేక శ్రద్ధ ఉందని, అందువల్లనే 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే పథకాన్ని గతంలో ప్రారంభించారన్నారు. ట్రైకార్ రుణాలను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పునరుద్ధరించి గిరిజనులందరినీ ఆర్థికంగా బలోపేతం చేస్తామన్నారు. ఎన్డీఎ కూటమి ప్రభుత్వం గృహనిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉద్యోగ నియామకాల కోసం డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వటం జరిగిందన్నారు. డిఎస్సీ కోసం శిక్షణ పొందే 5 వేల మంది ఎస్సీ, ఎస్టీల అభ్యర్థులకు ఉచితంగా వసతి కల్పించి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
గిరిజన ప్రజల శ్రేయస్సు, అభ్యున్నతి కోసం పనిచేసిన మహనీయులను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ అన్నారు. అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం 60 వసంత వేడుకలు ఒంగోలులో నిర్వహించటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఒంగోలు నియోజకవర్గంలో యానాదులు ఎక్కువగా నివశిస్తున్నారన్నారు. గతంలో కులాలు ఉండేవి కావని, అందరూ కలిసి ఉండేవారని, ఇప్పుడు కులాలకతీతంగా అందరూ కలిసి ఉండాలన్నారు. వేటచేసి జీవనం సాగించే యానాదులకు గుర్తింపు కార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. అర్హులైన వారందరికి పింఛన్లు, ఇంటి స్థలాలు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయించటం జరిగిందన్నారు. పోతురాజు కాలువ వెంట ఉండే గృహాల వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరలో వారికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.
కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మానాయక్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి జగన్నాధరావు, గిరిజన సంఘాల, ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.



