రసాయనాలు లేకుండా సాగు చేసిన కూరగాయల వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. ఈ విధంగా పండించిన కూరగాయల విక్రయ కేంద్రాన్ని సోమవారం కలెక్టరేట్ లో ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ… సేంద్రీయ వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఈ దిశగా ముందుకు వచ్చిన రైతులకు మద్దతుగా ఉండాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని తెలిపారు. తద్వారా రైతులకు ఆదాయంతోపాటు వినియోగదారుల ఆరోగ్యం కూడా పదిలంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా స్వయంగా కలెక్టర్ డబ్బులు ఇచ్చి రైతుల వద్ద కూరగాయలు కొనుగోలు చేశారు. మరిన్ని ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఏ.పి.సి. ఎన్.ఎఫ్. డి.పి.ఎం. శ సుభాషిణికి చెప్పారు. ముఖ్యంగా ప్రతి సోమవారం గ్రీవెన్స్ రోజున కలెక్టరేట్ వచ్చే ప్రజలు కొనుగోలు చేసేలా విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
సేంద్రీయ ఉత్పత్తుల వినియోగం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ కూడా ఈ విక్రయశాలలో కూరగాయలు కొనుగోలు చేశారు.

