స్థానికంగా పరిష్కార మయ్యే సమస్యలను మాత్రం స్థానికంగానే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక “మీకోసం” అర్జీలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణతో కలిసి ప్రజల నుంచి ఆమె అర్జీలు స్వీకరించారు. ఇందులో మొత్తం 241 అర్జీలు వచ్చాయి. వీటి పరిష్కారానికి అత్యధిక ప్రాధ్యాన్యం ఇవ్వాలని కలెక్టరు స్పష్టం చేశారు. అర్జీదారులతో మాట్లాడుతున్న ఫొటోలతోపాటు పరిష్కరించిన ఎండార్స్మెంట్ ను కూడా సైట్లో అప్లోడ్ చేయాలని ఆమె చెప్పారు. అర్జీలు పరిష్కరిస్తున్న తీరును ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నందున విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. సాంకేతిక సమస్యలు ఏమైనా ఉంటే అర్జీదారులకు వివరించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.
కార్యక్రమంలో డి.ఆర్.ఓ. ఆర్.శ్రీలత, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఝాన్సీ లక్ష్మీ, వరకుమార్, వెంకట సునీల్, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

