శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవస్థానంలో ఆర్యవైశ్యుల ఇలవేలుపు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి సరస్వతి దేవిగా భక్తులను అనుగ్రహించారు. ఆలయ తదియారాధన సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాల లో బుధవారం, సప్తమి, మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి ఆలయ అర్చకులు శర్మ, సాయి శాస్త్రోక్తంగా శ్రీ సూక్త సహితంగా దదియతో అభిషేకించారు. అనంతరం బండేపల్లి వెంకటేశ్వర శాస్త్రి అమ్మవారిని సరస్వతి దేవిగా అలంకరించారు. ముందుగా ఉభయ దాతలచే పూజ, తదుపరి బాలబాలికలకు సరస్వతి కటాక్షం సిద్దింపచేయుటకు సరస్వతికి సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు. సాయంత్రం జరిగిన గుడిఉత్సవంలో శ్రీవాసవి కోలాట భజన మండలి వారిచే కోలాటం, ఊంజల సేవ జరిగినది. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు.



