వైసిపి పార్టీకి మంచి చేసిన వారిని, కష్టపడేవారిని గుర్తించి వారి వివరాలను ‘గుడ్ బుక్’లో రాసుకుంటున్నామని మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తాము అధికారంలోకి రాగానే ‘గుడ్ బుక్’లో నమోదైనవారికి తప్పకుండా అవకాశాలు, ప్రమోషన్లు ఉంటాయని చెప్పారు. తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో బుధవారం మంగళగిరి నియోజకవర్గ కార్యకర్తలతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్ బుక్ మెయిన్ టైన్ చేయడం అనేది ఏమైనా పెద్ద పనా ? ఎప్పుడు లేని దుష్ట సాంప్రదాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. చంద్రబాబు చెప్పినవన్నీ మోసాలు, అబద్ధాలేనని, మోసం వల్ల ప్రజల కోపం నుంచి పుట్టే ఓటు వెల్లువతో చంద్రబాబుకి సింగిల్ డిజిట్ కూడా రాని పరిస్థితి వస్తుందన్నారు. అధికారం లేకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మనిషి వ్యక్తిత్వం బయటకు వస్తుందన్నారు. ఇలాంటి సమయంలోనే కష్టాలుంటాయని, ఆ కష్టాల నుంచే నాయకులు పుడతారని ఆయన చెప్పారు. నాలుగు నెలలుగా రాష్ట్రంలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయన్నారు.
పేపర్ బ్యాలెట్లోకి వెళ్లడం మంచిది : వైఎస్ జగన్ ట్వీట్
పేపర్ బ్యాలెట్ విధానం పునరుద్ధరించాలని మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. హర్యానా ఎన్నికల ఫలితాలపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా హర్యానా ఎన్నికల ఫలితాలు ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో మాదిరిగానే హర్యానాలో కూడా ఎన్నికల ఫలితాలు ప్రజలను గందరగోళానికి గురి చేశాయని చెప్పారు. అమెరికా, యూరప్, యుకె, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జపాన్, నార్వే, డెన్మార్క్, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్లో పేపర్ బ్యాలెట్ ను ఉపయోగిస్తున్నాయని, మనం కూడా పేపర్ బ్యాలెట్లోకి వెళ్లడం మంచిదని ఆయన పేర్కొన్నారు.