దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయంలో శుక్రవారం మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా జంట నగరాల పరిధిలోని భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. శుక్రవారం కూడా కావడంతో శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయాన్ని రంగురంగుల పూలతో వివిధ రకాలైన విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ చేశారు.
