కంట్రోల్ రూముకు ఫోన్ చేసిన ప్రతి ఒక్కరి సమస్యను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. బుధవారం ఆమె కలెక్టరేట్లోని జిల్లా స్థాయి కంట్రోల్ రూమును ఆకస్మికంగా తనిఖీ చేశారు. అప్పటివరకు వచ్చిన ఫోన్ కాల్స్ వివరాలను సిబ్బంది నమోదు చేసిన తీరును పరిశీలించారు. ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్న విధానంపై ఆరా తీశారు. అనంతరం ఫిర్యాదుదారులతో కలెక్టర్ ప్రత్యేకంగా ఫోన్లో మాట్లాడారు. కాల్ సెంటర్ దృష్టికి తీసుకువచ్చిన సమస్య పరిష్కారం అయ్యిందా ?... అధికారులు ఎంత సేపటికి స్పందించి సమస్యను పరిష్కరించారు?.. తదితర వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి సమస్యను సత్వరమే పరిష్కరించేలా సంబంధిత శాఖలను సమన్వయం చేయాలని కంట్రోల్ రూమ్ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెంట డి.ఆర్.ఓ. ఆర్. శ్రీలత, విపత్తుల నిర్వహణ విభాగ డి.పి.ఎం.మాధురి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు, ఇతర అధికారులు ఉన్నారు.