పేదలకు నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి గృహాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, కొండపి నియోజకవర్గం, పొన్నలూరు మండలం, పర్చూరివారిపాలెం గ్రామం వద్ద పేదలకు నిర్మిస్తున్న కాలనీను సందర్శించి గృహ నిర్మాణాల పురోగతిని పరిశీలించారు. ఈ గ్రామంలో మొత్తం 40 ఇల్లు మంజూరు చేయడం జరిగిందని, అందులో 12 మంది లబ్దిదారులు తమ సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునుచున్నారని, 28 మందికి ప్రభుత్వ స్థలంలో ఇల్లు మంజూరు చేయడం జరిగిందని హౌసింగ్ పిడి శ్రీనివాస ప్రసాద్, జిల్లా కలెక్టర్ కు వివరించారు. మొత్తం 40 గృహాల్లో 20 ఇల్లు పూర్తి కాగా, బిలో బేస్మెంట్ స్థాయిలో 3, బేస్మెంట్ స్థాయిలో 13, రూప్ స్థాయిలో 3, రూప్ కాస్ట్ స్థాయిలో1 ఇల్లు ఉన్నాయని గృహ నిర్మాణ సంస్థ పి.డి, జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఇళ్ల నిర్మాణాలు పురోగతిపై హౌసింగ్ ప్రతి రోజు పర్యవేక్షణ చేయడంతో పాటు ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఎప్పటికప్పుడు స్టేజీ అప్డేషన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. స్వయం సహాయక సంఘంలో ఉన్న ప్రతి లబ్దిదారునికి 35 వేల రూపాయల డ్వాక్రా రుణం మంజూరయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. హౌసింగ్ లబ్దిదారులు డ్వాక్రా గ్రూపులో లేకపోతే కొత్త గ్రూపు ఫామ్ చేసి ప్రతి ఒక్కరూ గ్రూపులో ఉండేటట్లు చూడాలన్నారు. ఇళ్ల నిర్మాణాలతో పాటు కాలనీల్లో విద్యుత్, సైడు కాలువలు, త్రాగునీరు, రోడ్లు తదితర మౌలిక సదుపాయాలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, కొంతమంది గృహాల లబ్దిదారులతో ముఖాముఖి మాట్లాడారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. తాము గృహ నిర్మాణ సామాగ్రి తెచ్చుకునేందుకు సరైన రహదారి లేక కొంత ఇబ్బంది పడుతున్నామని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ రహదారి ఏర్పాటు చేసి వారికి సామాగ్రి తెచ్చుకునేందుకు వీలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో కనిగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి కేశవర్ధన్ రెడ్డి, ఎంపిడిఓ సుజాత, తహశీల్దార్ పుల్లారావు, హౌసింగ్ డి ఈ సత్యనారాయణ, వివిధ శాఖల మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

